ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం పారిస్‌లో పలు సంస్థల అధిపతులు, సీఈవోలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ విధానాలు, మౌలిక వసతులు, మానవ వనరుల గురించి తెలిపారు. పెట్టుబడులకు సానుకూలతలపై చర్చించారు. పెట్టుబడులతో తెలంగాణకు వస్తే వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం ఎంఈడీఈఎఫ్ (మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్) ఉప కార్యనిర్వహణాధికారి జెరాల్డిన్ లెమ్హెతో ఆయన భేటీ అయ్యారు. ఫ్రాన్స్‌లో 95 శాతం పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ సంస్థ పనితీరును జెరాల్డిన్ ఆయనకు వివరించారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపారు. అనంతరం ఆటోమేటిక్ డాటా ప్రాసెసింగ్ (ఏడీపీ) సంస్థ ఛైర్మన్, సీఈవో అగస్టిన్ డీ రోమనెట్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఏడీపీ ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టింది. దేశంలో విమానయాన రంగంలో ఉన్న అవకాశాల గురించి కేటీఆర్ వివరించారు. ఏరోస్పేస్ రంగంలో నాణ్యమైన సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రసిద్ధ జీవశాస్త్రాల సంస్థ సనోఫీ అంతర్జాతీయ వ్యవహారాల అధిపతి ఫాబ్రిస్ బస్చిరా, ప్రపంచ టీకాలు, ప్రజా వ్యవహారాల విభాగాధిపతి ఇసాబెల్లె డెస్చాంప్స్‌తో భేటీ అయ్యారు. త్వరలో హైదరాబాద్‌లోని తమ పరిశ్రమలో సిక్స్ ఇన్ వన్ టీకాల ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.
అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ క్యాంపస్ స్టేషన్-ఎఫ్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. వెయ్యి అంకురాలకు కేంద్రంగా ఉన్న ఇందులో అంకుర వ్యవస్థాపన, పెట్టుబడి, వ్యాపార అవకాశాలను పరిశీలించారు. టీహబ్, వీ-హబ్, టీవర్క్స్‌తో సహకారంపై చర్చించారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, డిజిటల్ మీడియా సంచాలకుడు కొణతం దిలీప్, ఏవియేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కేటీఆర్ వెంట ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: