అడవుల సంరక్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడు గుర్తుంటాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన వీరులకు నివాళులర్పించారు.
ప్రకృతి వనరులను కాపాడటంతో పాటు... వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో కూడా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ధైర్యంగా విధులు కొనసాగించడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో కరోనా బారినపడి కొంతమంది అధికారులు చనిపోవడం విచారకరమన్నారు.
ప్రకృతి ప్రసాదించిన వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి... అధికారుల సహకారంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'అటవీ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది'