Minister Harishrao at Every Sunday Ten O Clock Ten Minutes : అసలే వర్షాకాలం.. అంటు రోగాలు ప్రబలే సమయం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. వ్యాధులు రాకుండా చూసుకోవటం అవసరమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. కోకాపేట్‌లోని తన నివాసంలో 10 నిముషాలు దోమల నివారణ కోసం ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం.. ఆరోగ్యవంతమైన కుటుంబం సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా తమ ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు.
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించండి : ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి కుటుంబ సమేతంగా తమ ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పూల కుండీలు, కొబ్బరి చిప్పలు వంటి వాటిల్లో నిలువ ఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు, కార్యాలయాలు, పరిశ్రమల్లో.. మూతలు లేని ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, కూలర్లు వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలన్నారు. దోమల వ్యాప్తి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతని.. దోమల రహిత రాష్ట్రం కోసం ప్రజలందరూ కలిసి పోరాడాలని సూచించారు.
నిద్రలేమితో గుండె సంబంధిత వ్యాధులు : నిద్ర సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. నిద్రలేమితో గుండె సంబంధిత వ్యాధులు మొదలు.. అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడుతున్నట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్లీప్ థరెప్యుటిక్స్, ది బ్రెత్ క్లినిక్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు నిద్రలేమి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి పలు సూచనలు చేశారు. గురకను ఎంతో మంది సాధారణ సమస్యగా భావిస్తున్నప్పటికీ.. గురక కారణంగా వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. నిద్ర సమస్యల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చేయటం హర్షించాల్సిన విషయమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవీ చదవండి :