కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు జూన్ నెల కోటా కింద రేషన్‌కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 15 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar) చెప్పారు. జులై నెలలో అయిదు కిలోల వంతున పంపిణీ చేస్తామన్నారు. కరోనా కష్టకాలంలో పేదలు అర్ధాకలితో బాధపడరాదన్న ఉద్దేశంతో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ, ఛౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు సత్వరం అందేలా చూడడంతోపాటు రేషన్ డీలర్ల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సహాయ కమిషనర్ శోభారాణి, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో 56.7 కోట్ల బకాయిల అంశాన్ని ఆ సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగానే ఆ సొమ్ము రేషన్ డీలర్లకు విడుదల చేశామని మంత్రి చెప్పారు.
అవకతవకలు జరిగితే అంతే..
రేషన్ డీలర్లపై ఉన్న పని ఒత్తిడి తగ్గించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామకాలు పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టాలని గంగుల ఆదేశించారు. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న తమ కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలన్న అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తిపై గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతిపాదనలు, విధివిధానాలు సిద్దం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. ప్రతి నిరుపేద కడుపు నింపాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు రేషన్ డీలర్లు కృషి చేయాలని తెలిపారు. ఈ నెల సంకల్పించిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా... బియ్యం పక్కదారి పట్టకుండా సరఫరా చేయాలని రేషన్ డీలర్లకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠినంగా వ్యవహరించడమే కాకుండా తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు.
బియ్యం సిద్ధంగా ఉంచాం..
ఈ నెల పంపిణీకి అవసరమైన 4 లక్షల 31 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సిద్దంగా ఉంచామని, 5వ తేదీ లోపు రేషన్ షాపులకు చేర్చి 87లక్షల 42 వేల 590 కార్డుదారులకు 5 నుంచి పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని... విధి నిర్వహణలో పూర్తి బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చేలా పని చేయాలని మంత్రి కమలాకర్ పిలుపునిచ్చారు. మరోవైపు, తమ సమస్యలు పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్‌కు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్చల్లో రేషన్ డీలర్ల ప్రధాన సమస్యలు, 28 కోట్ల రూపాయల పాత బకాయిలు విడుదల, కరోనా బారినపడి చనిపోయిన డీలర్లకు ఎక్స్‌గ్రేషియా, ఏ నిబంధనలు లేకుండా ఆ బాధిత కుటుంబంలో ఒకరికి డీలర్ షిప్ ఇస్తామని మంత్రి కమలాకర్ అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Dharani : భూసమస్యల పరిష్కారానికి 5 రోజులపాటు ప్రత్యేక డ్రైవ్