రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి ఈటల.. సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.
కలిసి పనిచేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. జలుబు, జ్వరాలతో బాధపడే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. అలాంటి వారు నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖలతో వైద్య, ఆరోగ్య సిబ్బంది కలిసి పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రబలకుండా చూడాలని కోరారు.
లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ
వర్షాలు మొదలైనప్పటినుంచి జీహెచ్ఎంసీ పరిధిలో 565 మెడికల్ క్యాంపులు నిర్వహించామని, 104 వాహనాల ద్వారా మరో 50 మొబైల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. క్యాంపుల ద్వారా ఇప్పటి వరకు 38,516 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించినట్లు తెలిపారు. సహాయ, పునరావాస కేంద్రాల్లో కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు లక్షణాలు ఉన్న 3406 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... అందులో 90 మందికి పాజిటివ్ నిర్ధరణ అయిందని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు
ఏ ప్రమాదం జరిగినా వెంటనే వైద్యం అందించేలా నగరంలోని ప్రతి ఆసుపత్రిలో వైద్యులు, సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్ల ద్వారా గ్రామాల్లో, హైదరాబాద్లో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. వచ్చిన వారి నుంచి సీజనల్ వ్యాధులు ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
వేడి వేడి ఆహార పదార్థాలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో కలుషిత నీటి ద్వారా ఎక్కువ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, క్లోరినేషన్ టాబ్లెట్లు ఇంటింటికి అందిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని..వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తినాలని మంత్రి కోరారు. రేపు అన్నీ జిల్లాల వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి : నీటమునిగిన ఇళ్లు.. ఆదుకోవాలని బాధితుల వేడుకోలు