ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజైన ఈ నెల 17న అందరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించడం ద్వారా హరితహారం యజ్ఞంలో భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచనలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సాధారణ ప్రజలతో పాటు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ ఛైర్పర్సన్లు, స్థానిక సంస్థల కో- ఆప్షన్ మెంబర్లు స్వయంగా మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు.
పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు, డీపీపీఓలు, జెడ్పీ సీఈఓలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని అధికారులు, సిబ్బంది విధిగా మొక్కలు నాటాలన్నారు. ఐకేపీ, మహిళా సంఘాల ప్రతినిధులు, సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: అక్షర కేసులో 8 మంది నిందితుల అరెస్టు... ఒకరు పరారీ