రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో త్వరలోనే గాంధీ సహా ఇతర వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. ప్రస్తుతం గాంధీలో కొవిడ్ సేవలు మాత్రమే అందిస్తున్న నేపథ్యంలో.. త్వరలో ఇతర వైద్య విభాగాలకు సంబంధించిన సేవలను సైతం పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొట్టమొదటి మాలిక్యులార్ ల్యాబ్, కొవిడ్ పరీక్ష కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
నిమ్స్‌లో కరోనా పరీక్షల కోసం ఏర్పాటు చేసిన కోబాస్-8800 యంత్రం అత్యంత అధునాతనమైందని.. దీని ద్వారా రోజుకి దాదాపు 3 నుంచి 4 వేల టెస్టులు చేయొచ్చని మంత్రి పేర్కొన్నారు. మాలిక్యులార్ ల్యాబ్‌లో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ స్థాయి పరీక్షలు చేయటం సులభమవుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీచూడండి: బాలు మృతిపట్ల కేటీఆర్, హరీశ్ రావు విచారం