MIM and Congress demand that Rajasingh be expelled : ఎమ్మెల్యే రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాతబస్తీలో నిరసనలు కొనసాగాయి. శాలీబండ్ రోడ్ వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి పెద్దసంఖ్యలో జనం రావడంతో... పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంఐఎం పత్తర్‌గట్టి కార్పొరేటర్ సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఆందోళనల దృష్ట్యా ... పోలీసులు పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను శాసనసభ నుంచి బహిష్కరించాలని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. పదేపదే తన చర్యలతో రాజాసింగ్.. శాసనసభ్యునిగా అర్హత కోల్పోతున్నారని మజ్లిస్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ లేఖలో పేర్కొన్నారు. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సహా పత్రికా కథనాలను ఉటంకించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల నుంచి కూడా రాజాసింగ్ సస్పెండ్ అయినట్లు గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ ప్రకారం అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని కోరారు. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారని మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి... భాజపా ఎంతకైనా బరితెగిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాటలే ఇందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతకల్లోలాలు రేపేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను... అవసరమైతే సమాజం నుంచి బహిష్కరించాలని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్న వేళ.. తన వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్... ఏ మతాన్నీ కించపర్చలేదన్నారు. కోర్టు పరిమితుల దృష్ట్యా ఎక్కువగా మాట్లాడలేనని... వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. పార్టీ షోకాజ్ నోటీసులపై వీలైనంత త్వరగా సమాధానం ఇస్తానని... తన వివరణతో భాజపా నాయకత్వం సంతృప్తి చెందుతుందని భావిస్తున్ననట్లు అభిప్రాయపడ్డారు. పార్టీ తనను వదులుకోదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పూర్తి నమ్మకం ఉందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: