కాయకష్టం చేసుకునేందుకు హైదరాబాద్ నగరం వచ్చిన జీవులు. కుటుంబాన్ని ఊళ్లలో వదలి కూలికోసం గడప దాటిన బతుకులు. రోజువారీ సంపాదనలో కొంత ఇంటికి పంపి ఉన్నదాంతో కాలం గడుపుతున్నారు. లక్షలాది మందిని అక్కున చేర్చుకునే భాగ్యనగరంలో పని దొరకటం కష్టమైంది. మాయదారి కరోనా ఉపాధిని దూరం చేసింది. ఆకలిని మాత్రం ఏం చేయలేకపోయింది. ఒకటి.. రెండ్రోజులు చేతిలో ఉన్న పైసలతో కాలం వెళ్లదీసిన కూలీ పేగులు తమ వల్లకాదంటూ కేకలు పెడుతున్నాయి. ఆకలి బాధ భరించలేక ఎవ్వరూ చూడకుండా నాలుగు మెతుకులు తింటున్నామంటున్నారు. ఒకప్పుడు.. నలుగురికీ వడ్డించిన కేటరింగ్ ఉద్యోగి.. చేతిలో పైసల్లేక ఇంటి ముఖం చూడలేక ఇక్కడే ఉంటున్నట్టు చెప్పాడు. ఇలా ఒకరిద్దరు.. కాదు మహానగరంలో వేలాది మంది.. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే అన్నం పొట్లాలతో రోజులు వెళ్లదీస్తున్నారు. అవి కూడా దొరకని రోజు యాచించలేక.. పస్తులు ఉంటున్నట్టు చెబుతున్నారు.
నేను కేటరింగ్ పని చేసేవాడిని. కరోనా కారణంగా పెళ్లిళ్లు, విందులు తగ్గిపోవడంతో ప్రస్తుతం పని దొరకడం లేదు. కూలి పని కోసం రోజూ బయటకు వచ్చినా నిరాశే ఎదురవుతోంది. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లలేక ఇక్కడే పనికోసం చూస్తూ కాలం గడుపుతున్నాను. ఎంతో మందికి నా చేతుల మీదుగా భోజనం పెట్టిన నేను ఇప్పుడు దాతలు పంచుతున్న ఆహార పొట్లాల కోసం ఎదురు చూడాల్సి రావడం బాధగా ఉంది.
- రమేశ్, మహబూబ్నగర్హోటల్లో పనిచేస్తూ సొంత సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడిని. పని చేసినన్ని రోజులు జేబు నిండుగా, గుండె నిబ్బరంగా ఉండేది. ప్రస్తుతం ఉపాధి కోల్పోయాను. కూలి పని కోసం ప్రయత్నించినా దొరకడం లేదు. చేతిలో డబ్బుల్లేవు. ఆకలికి తట్టుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని మరోచోట అన్నం కోసం వరుసలో నిలబడాల్సి వస్తోంది
-నిజామాబాద్‌కు చెందిన మోహన్ ఆవేదన ఇది.
పొట్లం కోసం ఎదురుచూపులు
ఉపాధి కోసం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో శ్రామికులు భాగ్యనగరానికి వస్తుంటారు. రెక్కాడితేకాని డొక్కాడని ఇలాంటి కష్టజీవుల బతుకుల్ని కరోనా అతలాకుతలం చేసింది. వారంలో రెండు మూడు రోజులు కూడా పని దొరకని పరిస్థితులు. ఆకలితో ఉండలేక వందలాది శ్రామికులు స్వచ్ఛంద సంస్థలు పంచుతున్న ఆహార పదార్థాలతో ఆకలి తీర్చుకుంటున్నారు. దోమలగూడలోని రామకృష్ణ మఠం నిర్వాహకులు పంచుతున్న ఆహారపు పొట్లాల కోసం నిత్యం 300 పైగా బారులు తీరుతున్నారు. డబీర్‌పురలో స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న ఓ వ్యక్తి రోజూ 1000-1500 మందికి భోజనం అందజేస్తున్నారు. నగరంలోని ప్రభుత్వాసుపత్రుల వద్ద రోగులకు తోడుగా వచ్చిన వారు సహా ఎంతోమంది అభాగ్యులు.. పలు సమాజ సేవకులు అందజేస్తున్న ఆహారంతో గడుపుకొంటున్నారు. ఇలా సికింద్రాబాద్, నల్లకుంట, పాతబస్తీ, దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో దాతలు అందజేస్తున్న భోజనం కోసం వరుస కడుతున్నారు.
ఇదీ చూడండి: కరోనాలో కొత్త లక్షణం.. 'కొవిడ్ టంగ్'