ఉపాధి సంగతి ఎలా ఉన్నా కుటుంబసభ్యులతో ఉండాలన్న తపనతో మూటముల్లె సర్దుకుని, పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడిచి వెళుతూ సాహసానికి ఒడిగడుతున్న బడుగు జీవులకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. దాదాపు 15 వేల మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామునుంచి బుధవారం తెల్లవారుజామువరకు దక్షిణమధ్య రైల్వే నడిపిన డజను ప్రత్యేక రైళ్లుల్లో దాదాపు 15 వేల మంది వలస కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లారు.
వ్యూహాత్మకంగా తరలింపు
కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన తర్వాత దేశంలో తొలి శ్రామిక్ ప్రత్యేక రైలు హైదరాబాద్‌లోని లింగంపల్లి స్టేషన్ నుంచి శుక్రవారం వెళ్లడంతో కార్మికుల్లో ఆశలు రేకెత్తాయి. రాజధాని చుట్టుపక్కల జిల్లాల నుంచి వందల కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న కార్మికుల కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైల్వే అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్‌ల నుంచి ‘శ్రామిక్’ రైళ్ల సమాచారం బహిర్గతమైతే.. విద్యార్థులు, ఇతరులు రైల్వేస్టేషన్లకు భారీగా వచ్చే అవకాశాలున్నాయన్న భావనతో ఈ మూడు రైల్వేస్టేషన్లను ప్రస్తుతానికి మినహాయించాలని రైల్వే, పోలీస్ అధికారులు నిర్ణయించారు. లింగంపల్లి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, బొల్లారం, మేడ్చల్ స్టేషన్లకు కార్మికుల్ని తరలించారు.
ఇప్పటివరకు భారీగా పేర్ల నమోదు
హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు సుమారు లక్ష మంది వలస కార్మికులు, కూలీలు పేర్లు నమోదు చేసుకున్నారని పోలీస్ అధికారులు రైల్వేశాఖకు తెలిపారు. బుధ, గురువారాల్లోనూ మరికొందరు పోలీస్‌స్టేషన్లకు వచ్చే అవకాశాలున్నాయని, రోజువారీగా సంఖ్యను, వారి గమ్యస్థానాలను తెలియజేస్తామన్నారు. కార్మికులు, కూలీలకు వైద్యపరీక్షలు చేయించాక ఎంత సేపటికి రైల్వే స్టేషన్లకు తరలించాలని హైదరాబాద్ పోలీసులు రైల్వేశాఖ ఉన్నతాధికారులను అడిగారు. 3 పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో నివాసముంటున్న బిహార్, ఛŸత్తీస్‌గఢ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల వలస కార్మికుల వివరాలన్నీ డీజీపీ కార్యాలయానికి సమాచారం ఇస్తున్నారు. రైల్వేశాఖ, డీజీపీ కార్యాలయం నుంచి ఆమోదం రాగానే వారిని రైల్వేస్టేషన్లకు తరలిస్తున్నామని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
ఒక్కో రైల్లో 1200 మందికి పైగా
ప్రత్యేక రైళ్లలో ఒక్కో బండిలో కనీసం 1,200 మంది చొప్పున డజను రైళ్లలో దాదాపు 15 వేల మంది వరకు వలస కూలీల్ని సొంత రాష్ట్రాలకు తరలించినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ నుంచి 1,250 మంది వలస కూలీలతో ప్రత్యేక రైలు బిహార్‌కు బయల్దేరింది. సోమవారం అర్ధరాత్రే ఆర్టీసీ బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారు. వారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అనంతరం అల్పాహారం, తాగునీటి సీసాలు అందజేశారు.
రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, రజత్‌శైనీ కార్మికులకు వీడ్కోలు పలికారు. తర్వాత రాత్రి 10 గంటలకు ఒక రైలు బయల్దేరగా అర్ధరాత్రి దాటాక మిగిలిన ప్రత్యేకరైళ్లు బయల్దేరాయి. వలస కూలీలను రైల్వేస్టేషన్ల వద్దకు తీసుకువెళ్లేందుకు ఆర్టీసీ ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 350, వరంగల్, ఖమ్మం, దామరచర్ల, రామగుండం నుంచి 150 బస్సులను ఆర్టీసీ నడిపించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మే 29 వరకు లాక్డౌన్