అనంతరం మెట్రోలో ప్రయాణించిన గవర్నర్ హైటెక్ సిటీకి చేరుకుని .... అక్కడ స్టేషన్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. తిరిగి మెట్రోలో అమీర్‌పేటకు చేరుకుని అక్కడి నుంచి రాజ్ భవన్‌కి రోడ్డు మార్గంలో వెళ్లారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 18 నిమిషాల్లో అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ చేరుకోవచ్చు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రారంభ కార్యక్రమంలో నేతలెవరు పాల్గొనలేదు.
అమీర్ పేట నుంచి ఉన్న మొత్తం పది కిలోమీటర్ల దూరంలో మధ్యలో ఎనిమిది స్టేషన్లు ఉండగా... అందులో కేవలం ఐదు స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. రైలు వెళ్లిన ట్రాక్ మీది నుంచే తిరిగి వెనక్కి రావాల్సి ఉన్నందున కొన్ని స్టేషన్లలో వాటిని ఆపేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో ఒకే కార్డుతో రైలు, బస్సు కారు వంటి సౌకర్యాలను వినియోగించుకునేందుకు వీలుగా సింగిల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
10 కిలోమీటర్ల దూరం:
ఈ మార్గంలోని రైళ్లు అమీర్‌పేట నుంచి మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
9 నుంచి 12 నిమిషాల మధ్య:
అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో నాలుగు నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తయిన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లేవారు మాత్రం అమీర్‌పేట్‌లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్‌లో పనిచేసే సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.
56 కిలోమీటర్లకు చేరిన మెట్రో మార్గం
హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్ - ఎల్బీనగర్, 17 కిలోమీటర్ల నాగోల్ - అమీర్‌పేట మార్గాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల అమీర్ పేట - హైటెక్‌సిటీ మార్గంలో సేవలు మొదలయినందున మొత్తం 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది.