సికింద్రాబాద్ తిరుమలగిరిలోని సైనిక ఆస్పత్రిలో ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు సైనిక ఆస్పత్రి లోపలికి వెళ్లేందుకు రఘురామ కుమారుడు భరత్ ఆస్పత్రి వద్దకు వచ్చారు. కాని లోపలికి వెళ్లడానికి అనుమతి లేదంటూ సైనికులు బయటే అడ్డుకున్నారు. దీంతో భరత్ అక్కడి నుంచి వెనుదిరిగారు
సైనిక ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు వైద్యులు రఘురామ రాజును పరీక్షిస్తున్నారు. ముగ్గురు వైద్యుల బృందం ఉదయం 11గంటల నుంచి రఘురామతో మాట్లాడి ఆయన ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. సీఐడీ అధికారులు తీవ్రంగా కొట్టారని రఘురామ ఆరోపిస్తుండటంతో... దెబ్బలు ఎక్కడెక్కడ తగిలాయనే విషయాలను మెడికల్ బోర్డు వైద్యులు పరిశీలించారు. వైద్యుల పరీక్షలను మొత్తాన్ని వీడియో తీస్తున్నారు.
హైకోర్టు నియమించిన రిజిస్ట్రార్ నాగార్జున సమక్షంలో వైద్యులు పరీక్షిస్తున్నారు. మెడికల్ బోర్డు వైద్యులు సీల్డ్ కవర్ లో రిజిస్ట్రార్ నాగార్జునకు నివేదిక ఇవ్వనున్నారు. ఆయన ఆ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. వైద్యపరీక్షలు ముగిసిన తర్వాత కూడా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామకృష్ణ రాజు సైనిక ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. చికిత్సకు అయ్యే ఖర్చును రఘురామ సొంతంగా ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 21వ తేదీన ఈ కేసుపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
ఇదీ చదవండి: పెళ్లిలో చేతివాటం చూపిన పురోహితుడు