టీకాలను ఎక్కడ భద్రపరిచారు... ఏ ఉష్ణోగ్రత వద్ద దాచిపెట్టారు... టీకా బాగానే ఉందా... పాడైందా? ఇలాంటి కీలకాంశాలను తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందో తెలుగమ్మాయి. ఆమే స్టాట్విగ్ సంస్థ సీఓఓ కొత్త కీర్తిరెడ్డి. ‘ఫోర్బ్స్ అండర్-30’ జాబితాలో చోటు దక్కించుకున్న కీర్తి విజయపథం ఆమె మాటల్లోనే చూద్దాం.. .
'నాన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుత మెదక్ ఎంపీ. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్ రంగ వ్యాపారి కావడంతో చిన్నతనం నుంచీ ఆ వ్యాపారాన్ని గమనిస్తూ పెరిగాను. దీంతో నాకూ ఈ రంగమంటే ఇష్టం పెరిగింది. హైదరాబాద్‌లో బీబీఏ పూర్తి కాగానే లండన్‌స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేశా. తర్వాత సింగపూర్‌లో ఓ లాజిస్టిక్ కంపెనీలో బిజినెస్ డెవలపర్‌గా కొంతకాలం పనిచేశాను. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న స్టాట్విగ్ కంపెనీలో వ్యాపార భాగస్వామిగా చేరి, సహ వ్యవస్థాపకురాలినయ్యాను. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గానూ పనిచేస్తున్నాను.
టీకా ఉత్పత్తి ఎంత ముఖ్యమో రవాణా, నిల్వ అంతే ముఖ్యం. తేడా వస్తే అది పనికిరాకుండా పోతుంది. అందుకే టీకాల రవాణా, నిల్వ ప్రక్రియలను ట్రాకింగ్ చేయడం కోసం రెండేళ్ల కిందట ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాం. జోర్డాన్, కజకిస్తాన్‌లలో దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాం. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చాక ప్రజలందరికీ ఇవ్వాల్సి వస్తుందని ముందుగానే గుర్తించాం. విస్తృత స్థాయిలో పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు సరఫరా, నిల్వ కీలకం కావడంతో దాన్ని పక్కాగా చేపట్టేందుకు వీలుగా మా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాం. టీకాపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ద్వారా అది ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతుంది... ఎక్కడ భద్రపరిచారు, నిబంధనల ప్రకారమే నిల్వ ఉంచారా వంటి అంశాలను తెలుసుకోవచ్చు. పక్కదారి పట్టకుండా చూడొచ్చు. పాడవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టీకా ఉత్పత్తి సంస్థలు, ఆసుపత్రులు దేశ, విదేశాల్లో ఎవరు కోరినా మా సాఫ్ట్‌వేర్ అందజేస్తాం.
నిజానికి ఈ సాఫ్ట్‌వేర్‌ను మొదట పీడీఎస్ బియ్యం సరఫరా, నిల్వ, పంపిణీని పర్యవేక్షించేందుకు అభివృద్ధి చేశాం. దీనిపై తాజాగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. చౌకబియ్యం పక్కదారి పట్టకుండా ఇది ఉపయోగపడనుంది. మా కంపెనీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా ఈ మధ్య ‘గ్లోబల్ ఇన్నోవేటర్’ పురస్కారం దక్కింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలనే నా జీవితలక్ష్యం 24 ఏళ్ల వయస్సులోనే సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏ రంగంలో ఉన్నా ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని అమ్మానాన్నలు అనేవారు. భవిష్యత్తులో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాణించాలనేది నా లక్ష్యం.'
ఇదీ చదవండి: ఎయిరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి కేటీఆర్