మీరు "పెళ్లైన కొత్తలో" అనే సినిమా చూశారా? అప్పుడెప్పుడో జగపతిబాబు-ప్రియణి కాంబోలో వచ్చిందిలెండి. ఇందులో సునిల్ ఓ "మోడ్రన్ మ్యారేజ్ బ్యూరో" నడుతుంటాడు. ఈ మోడ్రన్ బ్యూరో కాన్సెప్ట్ ఏమంటే.. వరుడిని బోలెడు కట్నంపోసి వధువు కొనుక్కుంటుంది కదా.. మరి, నాణ్యమైన సరుకు దక్కకపోతే ఎలా? అన్నది సునిల్ పాయింట్. అందుకే.. పెళ్లి కావాలంటూ వచ్చిన అబ్బాయిలను షోకేస్ లో బొమ్మల్లా పెడతాడు. అమ్మాయిలు వచ్చి, వారి బయోగ్రఫీ చూసి.. హెల్త్ సర్టిఫికెట్ స్టడీ చేసి.. ఫైనల్ గా నచ్చితేనే కొనుక్కొని వెళ్లిపోతారు. ఐ మీన్.. పెళ్లి చేసుకొని వెళ్తారు. అచ్చం ఇలాంటిదే.. నిజ జీవితంలోనూ ఓ మార్కెట్ ఒకటి ఉంది..! సినిమాలోని మాదిరిగానే.. ఇక్కడ పెళ్లి కొడుకులను అమ్ముతారు! అది కూడా ఎక్కడో కాదు.. మన దేశంలోనే!!
ఈ మార్కెట్ బీహార్ రాష్ట్రంలోని మధుబని నగరంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మార్కెట్ కాదు.. ఏకంగా 700 సంవత్సరాలుగా ఇక్కడ పెళ్లికొడుల విక్రయం జరుగుతోంది. ఈ సమీప ప్రాంతాల్లోని ప్రజలు.. తమ ఇంట్లోని అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తే.. షాపింగ్ మాల్ లో దుస్తులు కొనడానికి వచ్చినట్టుగా.. వరుడిని కొనుగోలు చేయడానికి వస్తారు..!
అయితే.. ఇది వారానికోసారి జరిగే సంత తీరు కాదండోయ్.. సంవత్సరానికో సారి జరిగే సంత! అవును.. మధుబని జిల్లాలోని స్థానిక మార్కెట్ ప్రాంతంలో ఏడాదికి ఓ సారి వేలాది మంది పురుషులు గుమిగూడుతారు. తమకు కాబోయే భార్యల కోసం వేచి ఉంటారు. షాపింగ్ మాల్ లోని వస్తువుల మెడలో ప్రైస్ ట్యాగ్ ఉన్నట్టుగా.. వీళ్లు కూడా ప్రైస్ ట్యాగ్ తో సిద్ధంగా ఉంటారు. ఎంత కట్నం ఇచ్చి, తమను పెళ్లి చేసుకోవచ్చో.. అందులో మెన్షన్ చేస్తారు. అంతేకాదు.. అబ్బాయిలు తమ వెంట పుట్టిన రోజు సర్టిఫికెట్ మొదలు.. చదువు, హెల్త్ సర్టిఫికెట్లు కూడా వెంట తెచ్చుకుంటారు. ఇదెక్కడి విడ్డూరం సామీ అంటే.. "చేయబోయేది భర్త ఉద్యోగం కదండీ.. అందుకే ఇవన్నీ ఉండాల్సిందే" అంటారు. వరుడి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం, ఆస్తి అంతస్తులు.. వంటి వివరాల ఆధారంగా.. అబ్బాయిల ధర నిర్ణయించబడుతుందక్కడ!
ఇలా.. యువకులు సిద్ధమై ఉన్న తర్వాత.. అమ్మాయి తరపు వాళ్లు వధువును వెంటబెట్టుకెళ్లి అల్లుడిని కొనుగోలు చేస్తారు. మార్కెట్లో క్వాలిటీ కూరగాయలకు ధర ఎక్కవున్నట్టే.. ఇక్కడ కూడా క్వాలిటీ ఉన్న అబ్బాయిలకు ధర ఎక్కువగా పలుకుతుంది. కాస్త వాడిపోయి ఉన్నా.. అర్హతలు తక్కువగా ఉన్నా.. రేటు తగ్గిపోతుందన్నమాట!
"గట్లనా..? అయితే మార్కెట్లో ముదిరిన, పుచ్చులున్న కూరగాయలు.. ఒకే ధరకు రెండు కేజీలు ఇస్తారు" అనే అప్రాచ్యపు కుళ్లు జోకులు వేయకండి. కళ్లు పోతాయ్..
మొత్తానికి.. అమ్మాయి తరపువాళ్లు.. ఆ మగాళ్ల గుంపును.. ఒకటీ రెండు రౌండ్లు చుట్టేసి, ఎవరైనా నచ్చితే.. తమ బడ్జెట్ కు దగ్గరగా ఉన్నారని అనుకుంటే.. ఆ పెళ్లి కొడుకును పిక్ చేసుకునేందుకు సిద్ధమవుతారు. వారి దగ్గరికెళ్లి బేరమాడుతారు. అయితే.. పూర్వ కాలంలో ఈడూ జోడు.. కాస్త పనిమంతుడు అనిపిస్తే బేరం తెగేది. కానీ.. ఇప్పుడు అంతా హైటెక్ యుగం కదా.. అమ్మాయిలంతా.. ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులే కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి యువకులకే ఎక్కువ డిమాండ్ ఉంది అక్కడి మార్కెట్లో!
"మరి, ఇలాంటి వారికి కట్నం ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది కదా?" అంటారేమో.. దానికి అమ్మాయిలు "తగ్గేదే లే" అంటున్నారు. రూపాయి ఎక్కువైనా క్వాలిటీ ప్రొడక్ట్ కావాలే తప్ప, చీప్ మెటీరియల్ అవసరం లేదంటున్నారు!!
ఎన్నో మ్యారేజ్ బ్యూరోలు.. మరెన్నో మ్యాట్రిమోనీ సైట్లు.. ఇంకెన్నో ఆన్ లైన్ డేటింగ్ యాప్ లు రాజ్యమేలుతున్న ఈ ఆధునిక యుగంలోనూ.. ఈ పెళ్లికొడుకుల మార్కెట్ కు ఆదరణ తగ్గలేదంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మార్కెట్లో ఐటమ్ గా మారేందుకు.. అబ్బాయిలు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వస్తారంటే.. ఆ మార్కెట్ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోండి.
ఇదంతా సరే.. ఈ మార్కెట్లో అబ్బాయిలను అమ్మడం ఎలా మొదలైంది అంటే..? దాదాపు 700 ఏళ్ల క్రితం కర్నాట్ రాజవంశానికి చెందిన రాజా హరిసింగ్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడని చెబుతారు. అయితే.. ఆ నాడు ఆయన ఉద్దేశం మంచిదే. అమ్మాయిలకు ఇప్పటి కాలంలోనే.. తమ భర్తను సెలక్ట్ చేసుకునే పూర్తి స్వేచ్ఛ లేదు. ఇక, ఏడు శతాబ్దాల క్రితం పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. అలాంటి రోజుల్లోనే.. నచ్చిన వాడిని భర్తగా పొందే అవకాశం, అమ్మాయిలకు ఉండాలనే గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలు పెట్టారు. ఏడాదికోసారి "సౌరత్ మేళా" లేదా "సభాగచ్చి" అనే పేరుతో 9 రోజులపాటు ఈ పెళ్లి పండుగ నిర్వహించేవారు. ఆ సమయంలో అమ్మాయిలు తమకు నచ్చిన వాడిని సెలక్ట్ చేసుకొని మనువాడేవారు. ఇప్పుడు మాత్రం.. ఆ 9రోజుల సంప్రదాయం మాత్రమే కొనసాగుతోంది. అందులోని మంచి ఉద్దేశం మాయమైంది. అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయక్కడ!
అచ్చం ఇలాంటిదే.. పెళ్లికూతురు మార్కెట్ కూడా ఉంది. ఇది కూడా మనదేశంలోనే! రాజస్థాన్ రాష్ట్రంలోని హౌదతి పట్టణ ప్రాంతంలో ఉందీ మార్కెట్. అక్కడ కూడా సేమ్ బిహార్ సీనే రిపీట్ అవుతుంది. అలాంటి బేరసారాలే నడుస్తాయి. అయితే.. అక్కడ అబ్బాయిల చదువు, ఉద్యోగం చూస్తారు కదా.. ఇక్కడ మాత్రం అమ్మాయికి వంట వచ్చా? ఇంటి పని సరిగా వస్తుందా? అనే వివరాలను చూస్తారు. వీటిని బట్టి అబ్బాయిలు సెలక్ట్ చేసుకుంటారు. అలాగని.. ఇక్కడ కట్నం ఉండదని అనుకుంటున్నారేమో.. అబ్బెబ్బే.. అలా అనుకుంటే మీరు పెళ్లి పందిట్లో బొక్కబోర్లా పడ్డట్టే. కట్నం కంపల్సరీ.. కాకపోతే మంచి అమ్మాయి, పని బాగా చేస్తుందంటే.. కన్సెషన్ లభిస్తుందంతే!
మొత్తానికి.. ఈ రెండు ప్రాంతాల్లో.. సంప్రదాయం మొదలు పెట్టిన మహానుభావుల ఉద్దేశం.. నచ్చిన ఆడ, మగ ఇష్టంగా పెళ్లి చేసుకోవడమే. కానీ.. మనం ఆధునిక మనుషులం కదా.. ప్రతిదాన్నీ డబ్బుతోనే జమకడతాం కదా.. అందుకే, మనకు కొనడం ఇష్టం.. అమ్మడం ఇష్టం.. స్వయంగా అమ్ముడుపోవడం కూడా ఇష్టమే.. అందుకే, సదుద్దేశంతో ఏర్పాటైన వివాహ క్షేత్రాలు.. ఫక్తు పశువుల సంతల్లా మారిపోయాయి..!
వీటిపై ఓ క్లిక్కేయండి..
- అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!!
- మనుషులకు తోకలు మొలుస్తున్నాయ్.. ఇట్స్ ట్రూ యార్..!
- ఫైవ్ స్టార్ హోటల్లో పందుల పెంపకం.. ఇదేందయ్యా ఇదీ..!?
- "యువరానర్.. దిసీజ్ వెరీ దారుణం.. ఈ కోడి పుంజును శిక్షించండి".. కోర్టుకెళ్లిన దంపతులు!!
- అక్కడ ఉద్యోగులు తప్పుచేస్తే.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!!
- ఇదేం వింత సామీ.. ఆక్సిజన్ లేకుండానే బతికేస్తోంది..!!
- "మిమ్మల్ని నా బంగారం అనుకున్నా.. ఛీ పోండ్రా.." రాజీనామా చేసిన యువతి..