కాంగ్రెస్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మానిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఠాగూర్‌కు రూ.50 కోట్లు లంచం ఇచ్చి రేవంత్‌రెడ్డి అధ్యక్ష పదవిని పొందారని పార్టీ వీడిన కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ నిరాధార ఆరోపణలు.. తన పరువునకు తీవ్ర భంగం కలిగించాయని మానిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. వారం లోపు రాతపూర్వకంగా బేషరతుగా కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రూ.కోటి పరువు నష్టం దావా వేయనున్నట్లు హెచ్చరించారు.
అధినేత్రి నిర్ణయాన్ని ఆమోదించాల్సిందే..
రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ వాదులెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని కార్యకర్తలు, నాయకులు తప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని సూచించారు. హుజూరాబాద్ ఉప పోరులో తెరాస-భాజపాల మధ్య ఓట్లు చీలినా స్థిరమైన ఓటు బ్యాంకుతో కాంగ్రెస్ ముందంజ వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కౌశిక్‌రెడ్డి రాజీనామా..
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ తెరాస టికెట్ తనకే వస్తుందని కౌశిక్‌రెడ్డి ఓ కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సంచలనం సృష్టించింది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి, టీపీసీసీ కార్యదర్శి పదవిలతో పాటు కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సోనియాగాంధీకి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఇన్నాళ్లు ప్రోత్సహించిన రాహల్ గాంధీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.
రేవంత్‌కు కౌశిక్ సవాల్..
రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్న వారిలో తాను మొదటివాడినన్న కౌశిక్.. రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యారని సోమవారం ఆరోపించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవదన్న రేవంత్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సీనియర్లను కాదని తెదేపా నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం దారుణమన్నారు. అమ్ముడుపోయింది తాను కాదని.. రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అయినా తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్‌రెడ్డి సీఎం అవుతారా అంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: Kaushik Reddy: '50 కోట్లు ఇచ్చి రేవంత్ అధ్యక్షుడయ్యాడు.. ఆరునెలల్లో కాంగ్రెస్ ఖాళీ!'