Makara Sankranti Festival 2024 : ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. రంగవల్లికల పండుగ సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, గోపూజలు ఇలా మూడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ వేళ ప్రతి రైతు ఇంట్లో కొత్త బియ్యం ఉంటాయి. ఆరుగాలం శ్రమించిన పంట ఇంటికి చేరటంతో దానధర్మాలు సైతం అధికంగానే చేస్తారు. మహాభారత కాలం నుంచే దీనిని జరుపుకుంటున్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో విశేషాలు కలిగిన సంక్రాంతిని రైతుల పండుగ అనే చెప్పవచ్చు. భోగి రోజు చేసుకునే పరమాన్నం నుంచి కనుమ రోజు గోపూజ వరకు అన్ని అన్నదాతను భాగస్వామిని చేసేవే.
సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా సర్కార్ ప్లాన్ - రేపటి నుంచి 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్
సూర్యుడు ప్రతినెలా ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తాడు. ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించేటప్పుడు మాత్రం తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. భానుడు ఒకవైపు నుంచి మరోవైపుకి మారడం వల్ల వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. ఈ నెలతో శీతాకాలం దాదాపు పూర్తి కాగా ఇప్పటి నుంచి పగలు సమయం పెరిగి, రాత్రి వేళ తగ్గుతుంది. పూర్తిగా ఈ పండుగను సౌరమానం ప్రకారం జరుపుకుంటాం కాబట్టి పండుగ తేదీల్లో ఏటా పెద్దగా మార్పులుండవు.
Makara Sankranti Festival 2024 : సంక్రాంతి పండుగలో మొదటి రోజు నువ్వుల నూనెతో మర్దనా చేసుకుని సూర్యోదయానికి ముందే స్నానాధి కార్యక్రమాలు ముగించి భోగి మంటలు పెడుతారు. ఇంట్లో ఉన్న చెడును మంటలో కాల్చేసి ఇంట్లో కొత్త శోభ వచ్చేలా చేయడం దీని పరమార్థం. అయితే, భోగి మంటలో పాత వస్తువులతో పాటు ఆవు పిడకలను కూడా వేసి కాల్చితే పర్యావరణంలోని హానికర బాక్టీరియా చనిపోయి ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని నమ్మకం. ఈ రోజున పంటను చేతికందించిన భగవంతుడికి కృతజ్ఞతగా కొత్త బియ్యంతో పరమాన్నం వండుతారు.
సంక్రాంతి ఎఫెక్ట్ - పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ
అవి త్వరగా అరగవు కాబట్టి బెల్లం, నువ్వులు కలిపి వండుతారు. వాతావరణానికి తగినట్లు మన శరీరం అలవాటు పడటానికి ఒంట్లో వేడి పెరగటానికి నువ్వులతో కూడిన పరమాన్నం చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు.. కాబట్టి దీనిని పొంగల్ అని పిలుస్తారు. ప్రతి ప్రాంతంలో బెల్లం, నువ్వులు ఏదో ఒక రూపంలో వంటకాల్లో ఉండేలా చూసుకుంటారు. తెలంగాణలో సకినాలు, ఆంధ్రలో అరిసెలు ప్రత్యేకం.
Sankranthi Celebrations In Telugu States : రెండో రోజైన మకర సంక్రాంతి రోజు రంగ వల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలుతో పాటు ఆకాశంలో ఎగిరే గాలిపటాలతో పండగ శోభ తొణికిసలాడుతుంది. ఈ పండగను ప్రకృతిలోని ప్రతి జీవి మరో జీవితో సంతోషం పంచుకునే వేడుక అని చెప్పవచ్చు. పిండితో వేసే ముగ్గుల తో నేలపై ఉన్న చీమలు ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. గొబ్బెమ్మల దగ్గర వేసే నవధాన్యాలు పక్షులకు ఆహారం అవుతాయి. ఇంటి నిండా ధాన్యంతో ఉంటుంది కాబట్టి హరిదాసులకూ భుక్తి దొరుకుతుంది.
గాలి పటాలు ఎగరేయటం విదేశాల నుంచి వచ్చిన సంస్కృతి అయినప్పటికీ మానసికోల్లాసం కోసం మనమూ ఆచరిస్తున్నాం. మూడో రోజైన కనుమ నాడు సిరిధాన్యాలతో తమ ఇళ్లు కలకలలాడటానికి కారణమైన గోవులను ప్రత్యేకంగా పూజిస్తుంటారు. వాటికి స్నానం చేయించి ప్రత్యేకంగా ఆలంకరిస్తారు. ఇలా ప్రకృతికి దగ్గరగా జరుపుకునే పండుగ సంక్రాంతి.
Sankranthi Celebrations : మన దేశంలో ఒక్కో పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు. కానీ సంక్రాంతిని మాత్రం దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. తమిళనాడులో పొంగల్ పేరుతో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ లో దీన్ని ఉత్తరాయణ్ అంటారు. అస్సాంలో బిహు, కశ్మీర్ లో శిశుర్ సంక్రాంత్, ఉత్తరాఖండ్ లో గుగుతి లేదా పక్షులను ఆహ్వానించే పండగ అని భావిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో మాఘ సాజి అని అంటారు. గోవాలో గాలిపటాలు ఎగరేసి, నువ్వుల వంటకాలు ప్రత్యేకంగా చేసుకుంటారు.
మహారాష్ట్రలో నువ్వులు-బెల్లంతో చేసిన రంగురంగుల లడ్డూలు ఇచ్చి పుచ్చుకుంటారు. కర్ణాటకలో సుగ్గి హబ్బా, కేరళలో శంకరాంతి, బిహార్ లో మిథిలా అని పిలుస్తారు. సంక్రాంతి పండగను సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ జరుపుకుంటారు. పక్కనే ఉన్న పాకిస్థాన్, నేపాల్‌లోని హిందువులు ఈ పర్వదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు.
సంక్రాంతి స్పెషల్- నోరూరించే అరిసెలు, బూందీ లడ్డూ! చేయడం చాలా ఈజీ!