హైదరాబాద్ బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా నివారణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వ్యాధి జాగ్రత్తలను వివరించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేస్తే కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులను అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వం 300 పడకలతో పాటు 37 మందితో వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచింది. మేడ్చల్ జాతీయ రహదారి వెంట నడకప్రయాణం చేస్తున్న 600 మంది వలస కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫంక్షన్ హాళ్లలో తరలించారు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. సముదాయించిన పోలీసులు వారికి భోజన వసతి కల్పించారు.
కరోనా మహమ్మారిపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని భాజపా సీనియర్ నేత లక్ష్మణ్ సూచించారు. ప్రధానమంత్రి విపత్తు నిధికి భాజపా నేత పూస రాజు 50 వేల రూపాయల చెక్కును లక్ష్మణ్‌కు అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ నివారణకు ఎలాంటి ఔషధం లేదని హైదరాబాద్ కోఠి ఇందిర్ బాగ్ మెడికల్ అసోసియేషన్స్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ వెల్లడించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించడం లేదని ఆయన ఆక్షేపించారు. ఔషధ దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక పాసులు పోలీసులు జారీ చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ గోపన్‌పల్లి తండాలోని 300మంది పేదలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిత్యావసరాలు పంపిణీ చేశారు. వైరస్ నియంత్రణకై ప్రజలంతా ఇంటికే పరిమితమై స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. పాతబస్తీ బహదూర్‌పురా పోలీసులు కిషన్‌బాగ్ ప్రాంతంలో పేదలకు ఉచితంగా ఆహారం అందించారు. కూకట్‌పల్లిలోని మురికివాడల్లో నేనుసైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలైన బియ్యం, పప్పు దినుసులు అందజేశారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత