కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరిపోదని అఖిలపక్షం నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మినరల్ ఫండ్స్‌ను ఉపయోగించి ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రులను, 104, 108 అంబులెన్స్‌లను పునరుద్ధరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో తెదేపా, సీపీఐ, తెజస పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు అధికార పార్టీ వైఫల్యాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైద్యులకు, పోలీసులకు, ఇతర సిబ్బందికి అఖిలపక్షం తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం పేర్కొన్నారు. రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం ఇవ్వాలని ఆయన కోరారు. రాబోవు 2 నెలలకు రూ. 5 వేలు ఇవ్వాలని, ఇంటి అద్దెల చెల్లింపులు వాయిదా వేస్తూ ఆర్డర్ తీసుకురావాలన్నారు. సొంత ఊళ్లకు వెళ్తామంటున్న వారికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తున్న విరాళాల వివరాలు బహిర్గతం చేయాలని కోరారు.