రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీనిని కఠినంగా అమలు చేస్తామన్నారు. ప్రజలంతా ఇదే స్ఫూర్తిని ఈనెలాఖరు వరకు పాటిస్తే.. కరోనా నుంచి మనకు విముక్తి లభిస్తుందని తెలిపారు. 30 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని శాసించే దేశాలు సైతం కరోనా ధాటికి విల్లవిల్లాడుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన సింగపూర్, జపాన్‌లో పరిస్థితి మళ్లీ తిరగబడిందని తెలిపారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయన్నారు. అగ్ర దేశాలతో పోలిస్తే.. మనం సురక్షిత స్థితిలోనే ఉన్నామన్న సీఎం.. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో లాక్‌డౌన్ ఉత్తమ విధానమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు..
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తామన్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్నామని.. పరిస్థితులను బట్టి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలా.. వద్దా అనేది కేబినెట్ నిర్ణయిస్తుందని తెలిపారు. పిల్లల చదువులు పాడైపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు. లాక్‌డౌన్ ముగిసే వరకూ ఎవరూ కాలు బయటపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రుల తీరు సరికాదు..
ఈ విపత్కర సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు చికిత్సలను నిరాకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఇది సరైంది కాదన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల వైఖరిపై వైద్యారోగ్యశాఖ అధికారులు సమీక్షిస్తారని తెలిపారు.
ఎవరికి వారే మాస్కులు తయారు చేసుకోవాలి..
దేశంలోని కోట్ల జనాభాకు మాస్కులను ప్రభుత్వమే పంపిణీ చేయాలంటే అది సాధ్యం కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలే స్వంతంగా ఇళ్లల్లో మాస్కులను తయారు చేసుకోవాలని సూచించారు. మర్కజ్ కేసులు లేకుంటే ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉండేవాళ్లమని ఆశాభావం వ్యక్తం చేశారు.
రూ.1500 ఖాతాల్లో జమచేస్తాం..
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 ఆర్థిక సహాయం బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
ఇవీచూడండి: ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు