రాష్ట్రంలో సడలింపులతో కూడిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉల్లంఘనలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి చెందిన అధికారులు 18 బృందాలుగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన 140 వ్యాపార సంస్థలను అధికారులు సీజ్ చేశారు. వీటిలో వ్యాయామశాలలు, శిక్షణా సంస్థలు, బేకరీలు, హోటళ్లున్నాయి. వ్యాయామశాలలు తెల్లవారుజామునే తెరిచి తిరిగి 10 గంటల లోపు మూసేస్తున్న విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు.... ఉదయమే రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంచాలకులు విశ్వజిత్ కంపాటి తెలిపారు.
దుకాణాలకు నెంబర్లు కేటాయిస్తున్నారు
రెడ్‌జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌లోకి వరంగల్ అర్బన్ జిల్లా మారుతున్న సందర్భంగా కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ డేటా ఆధారంగా దుకాణాలకు నెంబర్లు కేటాయిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో సరి,బేసి సంఖ్య ఆధారంగా దుకాణాలు తెరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దుకాణాలు తెరిచారు. మాస్కులు ధరించకుండా బయట తిరిగేవారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. కరీంనగర్‌లో 21రోజులుగా కొత్తకేసులు నమోదు కాకపోవడంతో.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలను గ్రీన్ జోన్‌లోకి మార్చాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా గ్రీన్‌జోన్‌లో కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా తక్కళ్లపల్లి గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా పరిగణించి ప్రత్యేక వైద్యబృందాలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చెక్ పోస్టుల వద్దే గుర్తించి హోం క్వారంటైన్‌కు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కంటైన్‌మెంట్ జోన్లున్న జోగులాంబ గద్వాల మినహా మిగిలిన అన్నిచోట్ల అన్ని దుకాణాలు దాదాపుగా తెరుచుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వేలాది మంది సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. వీరందరినీ జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్దే గుర్తించి వివరాలు సేకరించి హోం క్వారంటైన్‌కు పంపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 25రోజులుగా కరోనా అలజడి లేకపోవడంతో.. జనజీవనం సాధారణ స్థితికి చేరకుంది. రాత్రి సమయంలో అకారణంగా రోడ్ల మీదకి వచ్చే వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోనూ నెల రోజులుగా కేసులు లేనందున ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరోనా నుంచి బయటపడినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
మాస్కు లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా
ఖమ్మం జిల్లాకు ఆరెంజ్ జోన్ సడలింపులివ్వడంతో ఖమ్మంలో జనసంచారం పెరిగింది. వివిధ పనుల నిమిత్తం నగర వాసులు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. పోలీసులు చెక్ పోస్టులు అన్ని తెరవటంతో వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మాస్కు లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో 45 రోజుల తర్వాత పలు దుకాణాలు తెరుచుకున్నాయి. భువనగిరిలో నిబంధనులు ఉల్లంఘించిన 7 దుకాణాలకు మున్సిపల్ కమిషనర్ 35 వేల రూపాయల జరిమానా విధించారు.
తెరుచుకోని మెస్‌లు, హోటళ్లు, టీ దుకాణాలు
లాక్‌డౌన్ సడలింపులతో ఆదిలాబాద్‌లో దుకాణాలు తెరుచుకున్నాయి. జనాలు రోడ్ల మీదకొచ్చారు. రహదారులన్నీ జనసందోహమయ్యాయి. కిరాణా, వస్త్ర, మెడికల్, జనరల్ స్టోర్ట్స్ తెరిచారు. పోలీసు బందోబస్తు నడుమ వైన్ షాపుల లావాదేవీలు కొనసాగాయి. మెస్‌లు, హోటళ్లు, టీ షాపులు తెరుచుకోలేదు.
ఇదీ చూడండి: కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ