Excise Revenue in Telangana from Nine Years : రాష్ట్రంలో ఏటా మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా వస్తోంది. అబ్కారీ శాఖ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైంది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తుండగా ఆ తరువాత స్థానంలో నిలుస్తూ.. ఎక్కువ రాబడులను తెచ్చి పెడుతోంది అబ్కారీ శాఖ.
Liquor Sales Are Increasing In Telangana : తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు, మరో వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పర్యాటక హోటళ్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.90 నుంచి రూ.100 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోతుంది. మద్యం తాగే మందుబాబుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో మద్యం ఆదాయం కూడా పెరుగుతోంది. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్, ఎక్సైజ్ సుంకంలతో పాటు లైసెన్స్‌ల ఫీజు, సిట్టింగ్ రూమ్‌ల అనుమతులు, ప్రత్యేక వేడుకలకు ఇచ్చే అనుమతుల ఫీజులు తదితర వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ.35,145.10 కోట్లు విలువైన 3.52 కోట్లు లిక్కర్ కేసులు, 4.79 కోట్లు బీరు కేసులు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
తొమ్మిదేళ్లలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయం : ఉమ్మడి రాష్ట్రం 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఆ వెంటనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖలు కూడా విడిపోయాయి. అప్పటి నుంచి ప్రభుత్వ శాఖలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకంగా పాలనా పగ్గాలు చేపట్టాయి. రాష్ట్రం ఏర్పాటైన 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.10,833 కోట్లు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి రాబడి వచ్చింది. ఆ తరువాత సంవత్సరం 2015-16 ఆర్థిక ఏడాదిలో రూ.12,760 కోట్లు మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇక 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.14,184 కోట్లు ఆదాయం వచ్చింది.
2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.17,597 కోట్లు మేర రాబడి వచ్చినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,959 కోట్లు మేర రాబడి రాగా 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ.22,605 కోట్లు రాబడి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.27,888 కోట్లు, 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.32,859 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.34,857.55 కోట్లు మేర రాబడులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Huge Income from liquor sales in telangana : మొత్తం తొమ్మిది ఏళ్లలో మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం, లైసెన్స్ ఫీజులు ఇతరత్ర రాబడుల ద్వారా రూ.1,94,488.55 కోట్లు ఆదాయం వచ్చింది. గడిచిన తొమ్మిదేళ్లలో ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. తరచూ మద్యం ధరలు పెంచుతూ వస్తుండడం, గుడుంబా, అక్రమ మద్యం నిలువరిస్తుండడంతో మద్యం విక్రయాలు పెరుగుతున్నట్లు అబ్కారీ శాఖ అంచనా వేస్తుంది. ఇందువల్లనే ఆదాయం ఏటా పెరుగుతూ వస్తోందంటున్న ఎక్సైజ్ శాఖ అధికారులు.. ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల కోట్లు మేర ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇవీ చదవండి: