ఈ-వాచ్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించారు. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ యాప్‌తో.. ఎస్ఈసీకి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలపై ఫిర్యాదుల స్వీకరణకు యాప్‌ను రూపొందించినట్లు వివరించారు.
వ్యవస్థలో పారదర్శకత కోసమే సాంకేతిక వినియోగమని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. మిగిలిన యాప్‌లపై ఎలాంటి అపనమ్మకం లేదని స్పష్టం చేశారు. రిలయన్స్ జియో సహకారంతో యాప్ తయారుచేశామన్న ఎస్‌ఈసీ.. బయటి వ్యక్తులెవరినీ పర్యవేక్షణకు తీసుకోవట్లేదన్నారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును కచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యపై చర్యలను ఫిర్యాదుదారులకు తెలియజేస్తామని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తుంటానని నిమ్మగడ్డ చెప్పారు. సీరియస్ ఫిర్యాదుల బాధ్యత కలెక్టర్, ఎస్పీలదేనని తేల్చి తెలిపారు. పరిష్కారంలో విఫలమైతే ఎన్నికలు నిలిపివేసే పరిస్థితి వస్తుందన్న ఆయన.. సాంకేతికత వినియోగించి ఎన్నికల్లో అక్రమాలు నివారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసే ప్రతి వ్యక్తికి ఒక నెంబర్ ఇస్తామన్న ఎస్‌ఈసీ.. నెంబర్ సహాయంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చని సూచించారు.
సీనియర్ అధికారి పర్యవేక్షణలో కాల్ సెంటర్ నడుస్తుందని ఈ సందర్భంగా ఎస్‌ఈసీ వివరించారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువమంది నామినేషన్లు వేస్తున్నారన్న ఆయన.. మామూలుగా జరిగే ఏకగ్రీవాలను తాము పట్టించుకోమని తేల్చిచెప్పారు. అసాధారణ ఏకగ్రీవాలు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ఈసారి అసాధారణ ఏకగ్రీవాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని అన్నారు.తాను రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆధార్ కేంద్రాల్లో 'రేషన్' బారులు