
దిల్లీలోని మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణలో జాతీయస్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు దాని ఛైర్మన్ అనిల్ శాస్త్రి తెలిపారు. సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థ(ఐటీఈ)తో కలిసి దీనిని నిర్వహిస్తామని తెలిపారు. ఏటా అయిదువేల మందికి అత్యుత్తమ శిక్షణ అందిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని ప్రారంభిస్తామన్నారు. మంగళవారం అనిల్ శాస్త్రి తమ ప్రతినిధి బృందంతో ప్రణాళికసంఘ ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇప్పటికే ట్రస్టు తరఫున దిల్లీలో అనేక విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని, విస్తరణలో భాగంగా కొత్త నైపుణ్యాభివృద్ధి సంస్థను స్థాపించాలని భావించామని తెలిపారు. వినోద్‌తో కలిసి హైదరాబాద్‌ను సందర్శించాక కొత్త జాతీయ సంస్థ ఏర్పాటుకు ఇది అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా గుర్తించామని శాస్త్రి అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న సంస్థ విద్యార్థులు, యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే కాక వివిధ కోర్సులను నిర్వహిస్తుందని తెలిపారు. సంస్థ ఏర్పాటుకు స్థలం కేటాయింపుతో పాటు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకరిస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ శాస్త్రికి హామీ ఇచ్చారు.
రాజేంద్రనగర్ వద్ద స్థలం కేటాయింపు!
జాతీయ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థకు రాజేంద్రనగర్ వద్ద స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. మరో పక్షం రోజుల్లో సీఎం కేసీఆర్‌తో అనిల్ శాస్త్రి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చూడండి: School Rationalization: టీచర్ పోస్టుల హేతుబద్ధీకరణ, బడుల విలీనానికి సర్కారు కసరత్తు