తెలంగాణ రాష్ట్రసమితి రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఈ నెల 25న హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. అదే రోజు పార్టీ సర్వసభ్య సమావేశం-ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపారు. రెండు దశాబ్దాల తెరాస ప్రస్థానం, ఏడేళ్ల జనరంజకమైన పాలన, రాష్ట్రం సాధించిన చిరస్మరణీయమైన విజయాలను తెలియజేస్తూ నవంబరు 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట భారీ బహిరంగసభను జరుపుతామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు గ్రామ, మండల, వార్డు కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఇలా..
‘‘పార్టీ విధివిధానాల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. 2019లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా.. 2020, 2021లలో కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించలేదు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గింది. టీకాల ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. నెల రోజుల్లో 100 శాతం పూర్తి కానుంది.ఈ నేపథ్యంలో ఈసీ నిబంధనలను అనుసరించి అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నాం. అందుకు ఈ నెల 17న షెడ్యూల్ విడుదలవుతుంది. 17 నుంచి 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న పరిశీలన, 24న ఉపసంహరణ ఉంటుంది. 25న జరిగే ప్లీనరీలో 14 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు. వారి సమక్షంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. రిటర్నింగ్ అధికారిగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షకులుగా పర్యాద కృష్ణమూర్తి, సోమ భరత్‌కుమార్‌లు వ్యవహరిస్తారు. ప్లీనరీ నిర్వహణ కోసం ఈనెల 17న పార్టీ అసెంబ్లీ, పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహిస్తారు. పార్టీ తీర్మానాల కమిటీ ఛైర్మన్‌గా మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి వ్యవహరిస్తారు.
సంస్థాగత నిర్మాణం పూర్తి
తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ ప్రక్రియ పూర్తయింది.12,769 గ్రామాల్లో కమిటీలు, 3600 పైచిలుకు వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల, పట్టణ కమిటీలు. అనుబంధ సంఘాల ఎన్నికలు జరిగాయి. తెరాస రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల తర్వాత ఆయన ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల ఎంపిక జరుగుతుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని కూడా ఎంపిక చేస్తారు. నవంబరు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో నిర్మించిన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతాయి. హైదరాబాద్, వరంగల్‌లలో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపడతాం. -కేటీఆర్, తెరాస పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు
ఈ సమావేశంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌అలీ, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ఎంజీ రంజిత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణమూర్తి, భరత్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
27న సన్నాహక సమావేశాలు
రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటై, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన పార్టీగా తెరాస నిలిచింది. అద్భుతమైన విధానాలతో పరిపాలన సాగిస్తోంది. వీటన్నింటిని చాటేందుకు వరంగల్‌లో విజయగర్జన సభ నిర్వహించనున్నాం. పార్టీ గ్రామ, వార్డు, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు లక్షల మంది దీనికి తరలివస్తారు. ఈ సభ సన్నాహక సమావేశాలను ఈ నెల 27న ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తాం.
అక్టోబర్ 25నాడు రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం పార్టీ జనరల్ బాడీ మీటింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నాం. అక్టోబర్ 17నాడు ఈ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలవుతుంది. అదే రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కూడా జరుగుతుంది. 25వ తేదీ నాడే పార్టీ అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత పార్టీ ప్లీనరీ కొనసాగుతుంది. రెండు దశాబ్దాల తెరాస పార్టీ ప్రస్థానం, ఏడేళ్ల జనరంజకమైన పాలన, తెలంగాణ సాధించిన చిరస్మరణీయమైన విజయాలు... వీటన్నింటిని కూడా ఘనంగా జరుపుకోవడానికి నవంబర్ 15వ తేదీనాడు వరంగల్ వేదికగా 'తెలంగాణ విజయ గర్జన' పేరిట ఒక బహిరంగ సభను కూడా తెరాస పార్టీ నిర్వహించబోతుంది. -కేటీఆర్, తెరాస పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు
ఇదీ చదవండి: KTR latest news: కేటీఆర్‌ను కలిసిన డీఎంకే ఎంపీలు.. ఆ లేఖలో ఏముందంటే...