KTR Says BRS Will Win 99 seats In Telangana Elections : ఈ తొమ్మిదేళ్లలో మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. ఇంకా చాలా ప్రణాళికలు కేసీఆర్ ఆలోచనలో ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నానక్ రామ్‌గూడలో క్రెడాయ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మరణంతో కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలనుకున్నానని కేటీఆర్ తెలిపారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని ఆయన వివరించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. తెలంగాణది సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి అని.. అందుకే అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నామని వివరించారు. అందుకే మూడోసారి కూడా కేసీఆర్‌నే సీఎం అయ్యి.. బీఆర్ఎస్ అత్యధిక సీట్లలో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
"స్థిరమైన, ధృడమైన, బలమైన నాయకత్వం మన రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. 119 స్థానాలు సింఫుల్ మెజారిటీ 60.. 10 నుంచి 15 సీట్లు అటుఇటు అయిపోతే రాష్ట్రం అస్థిరం అయిపోతుందని తెలంగాణ వ్యతిరేకులు ఆగం చేశారు. ప్రతిపక్షాలకు క్లారిటీ ఉండకపోవచ్చు ఏమో గానీ.. ప్రజలకు స్పష్టమైన క్లారిటీ ఉంది. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని పిచ్చోళ్లు కూడా వదులుకోరు. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం. మొదటి ఎన్నికల్లో బీఆర్ఎస్ 63 సీట్లతో గెలిస్తే.. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. ఇప్పుడు జరగబోయే 2023 ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో కచ్చితం గెలుస్తాం." - కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
KTR Says Party Will Win 100 Seats : ఈ 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అద్భుతమని ప్రసంగించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కానీ స్టార్ట్ అప్ ఏకో సిస్టం ఉన్న వనరులు కానీ ఏది చూసుకున్న నేడు హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరవాసులంతా హైదరాబాద్‌ను చూసి గర్వపడే విధంగా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు. నాయకుడికి దృఢ సంకల్పం ఉంటే .. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే మార్పు కచ్చితంగా వస్తుందన్న కేటీఆర్.. నిజంగా పని చేసి చూపించడం పెద్ద సవాల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డితో పాటు సిఐఐ తెలంగాణ చైర్మన్, క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :