రాష్ట్రంలో ఫిబ్రవరి 15న జరగనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు తెరాస కసరత్తు ప్రారంభించింది. పురపాలక ఎన్నికల మాదిరి.. సహకార ఎన్నికల బాధ్యతను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్... కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించినట్లు సమాచారం.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులను తెరాస అధిష్ఠానం అప్రమత్తం చేసింది. సహకార ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అయినా పార్టీకి చెందిన వారిని డైరెక్టర్లుగా, ఛైర్మన్లుగా ఎన్నుకోవడానికి కృషి చేయాలని పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికలకు కూడా సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 906 సహకార సంఘాల్లో 18.42 లక్షల మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అనంతరం రైతు సమన్వయ సమితి ద్వారా గిట్టుబాటు ధరలు, పంటల సాగు కాలనీల ఏర్పాటు వంటి వాటిపై ముందుకెళ్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనికి సహకార వ్యవస్థ మద్దతు అవసరమని ఆయన భావిస్తున్నారు.
కేటీఆర్‌కు బాధ్యతలు
పురపాలక ఎన్నికల మాదిరిగానే సహకార ఎన్నికలకు సంబంధించి పార్టీ పర్యవేక్షణ బాధ్యతలనూ కేసీఆర్.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించినట్లు తెలిసింది. కేటీఆర్ వెంటనే రంగంలోకి దిగారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశం గురించి మాట్లాడారు.
ఈ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున అంతకు ముందే డైరెక్టర్ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను తెరాస చేపట్టనుంది.
- ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..