krishnashtami 2022: ఆలయాల్లో కోలాహలం.. భక్తుల ప్రత్యేక పూజలు.. పిల్లన గ్రోవితో చిన్నారులు.. గోపికల వేషధారణలో నృత్యాలు.. వెరసి.. రాష్ట్రమంతా సందడిగా మారింది. కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని హైదరాబాద్ కూకట్పల్లి ఇస్కాన్ ఆలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. పాతబస్తీలోనూ జన్మాష్టమి వేడుకలు కోలాహలంగా జరిగాయి. షాలిబండలోని శ్రీశ్రీ రాధేకృష్ణ ఆత్మరామన్ ఆలయంలో భజనలు చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
నిజామాబాద్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజల అనంతరం.. కృష్ణుడి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని వరంగల్‌లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పోతన నగర్‌లోని శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో కృష్ణునికి అభిషేకం చేశారు. అర్చకులు స్వామివారికి 108 నైవేద్యాలను సమర్పించారు. ఖమ్మంలోని పలు పాఠశాలల్లో శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణలో అలరించారు. ఉట్టి కొట్టడంతో పాటు... కోలాటం ఆడి సందడి చేశారు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 200లకు పైగా మహిళలు వ్రతంలో పాల్గొన్నారు. నిర్మల్‌లోని మురళీ కృష్ణ, రాధాకృష్ణ ఆలయాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్ శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో నృత్యాలు చేసి అలరించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టి, నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు.
ఇవీ చూడండి..