Komatireddy Venkatreddy Takes Charges As Telangana R&B Minister : గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్లమీద శ్రద్ధ పెట్టలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈరోజు సచివాలయంలో తన ఛాంబర్లో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం 9 దస్త్రాలపై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ ముషంపల్లి ధర్మాపురం రోడ్ 4 లైన్ వేయడం వంటి అంశాలు ఉన్నాయి.
Komatireddy Venkatreddy On Telangana Roads Development : సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విషయమై దిల్లీలో సోమవారం రోజున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవిస్తానని తెలిపారు. రాష్ట్రంలో 14 రోడ్లను నేషనల్ హైవే హోదాకు పెంచాలని, రీజినల్ రింగ్ రోడ్ సౌత్‌ని నేషనల్ హైవేగా గుర్తించాలని, విజయవాడ, హైదరాబాద్ రోడ్ని 6 లైన్ లకు పెంచాలని, హైదరాబాద్- కల్వకుర్తి రోడ్ని 4 లైన్ చేయాలని గడ్కరీకి విన్నవిస్తానని చెప్పారు.
ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్‌బాబు
"రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తాను. ఈ విషయమై దిల్లీలో రేపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవిస్తాను. నూతన కౌన్సిల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం ప్రారంభిస్తాము". - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి
సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌ను పెంచాలని మంత్రి కోమటిరెడ్డి కోరనున్నారు. 9 ఫైల్స్‌లో ఐదింటిని సోమవారం రోజున గడ్కరీ గారిని కలిసి అనుమతి కోసం కోరుతానని చెప్పారు. హైదరాబాద్- విజయవాడ రోడ్లో మల్కాపూర్ వరకు కొంత పని అయిపోయిందని తెలిపారు. మిగిలిన పనిని 6 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండున్నర గంటల్లో చేరుకునేలా రోడ్లను అభివృద్ధి చేస్తామని మిగిలిన వాటిని 2 నుంచి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని వివరించారు.
నూతన కౌన్సిల్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanthreddy) ఆదేశించినట్లు వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలో కొత్త కౌన్సిల్ భవన నిర్మాణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాత భవనం ఆవరణలోనే ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. 2 రోజుల్లోనే ఏం చేశారని హరీశ్‌రావు మాట్లాడుతున్నారని, 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు ఏం చేశారో చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.