రిజర్వేషన్లపైనా చర్చ...
నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19 వేల 2వందల 5 కోట్లు విడుదల చేయాలని అభ్యర్థించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సహా జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు ఎస్సీల వర్గీకరణకు, రాష్ట్రంలో వెనకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లు కలిపి బీసీలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించేందుకు సహకరించాలని విన్నవించారు. పీపీపీ పద్ధతిలో కరీంనగర్లో ఐఐఐటీ నెలకొల్పేందుకు చేయూతనివ్వాలని కోరారు. పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించారు.
వరంగల్ టెక్స్టైల్ పార్క్‌కు రూ.1000 కోట్ల అభ్యర్థన...
హైదరాబాద్ – నాగపూర్, వరంగల్ – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి పరచాలని సీఎం అభ్యర్థించారు. వెనుక బడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.4వేల కోట్లు కేటాయించాలని ప్రధానికి విన్నవించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం తరహాలో కేంద్రం ఖర్చుతో వరంగల్‌లో గిరిజన వర్సిటీ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ టెక్స్టైల్ పార్కు కోసం రూ.1000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలని కోరారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు సహకరించాలని పేర్కొన్నారు. వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదలకు అభ్యర్థించారు.
మంత్రులతో సమావేశాలు...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కేసీఆర్ సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయాలపై చర్చించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ సీఎం భేటీ అయ్యారు. కంటోన్మెంట్ భూముల వ్యవహారంపై మంత్రితో చర్చించినట్టు సమాచారం.
ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!