KA paul fire on kavitha and cm kcr: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులను, మహిళలను, బడుగు, బలహీన వర్గాలను, యువకులను మోసం చేశారని కేఏ పాల్ ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉందంటూ నోటిసులిచ్చిన ఈడీ.. 48 గంటల్లోనే కవితను అరెస్ట్ చేయడం ఖాయమని అన్నారు. కవిత అరెస్ట్ కేవలం ఆరంభం మాత్రమే అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లు చేసిన పాపం పండిందని ఎద్దేవా చేశారు. మార్చి 10వ తేదీ కవిత అరెస్ట్ అవుతారన్నారు. కేసీఆర్ బినామీలు, అధికారులు ప్రతి ఒక్కరు ఆయనకు దూరంగా ఉండాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవిత చేసిన పాపాలు తారస్థాయికి చేరుకున్నాయి. కవితను ఈడీ రాబోయే 48 గంటల్లో కచ్చితంగా అరెస్ట్ చేస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కేసీఆర్ రైతులను, మహిళలను, నిరుద్యోగులను, బడుగు బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారు. ఆయన పశ్చాతప పడవలసిన సమయం ఆసన్నమైంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆయన చేసిన పాపం ఆకాశాన్ని అంటింది. కేసీఆర్ బినామీలు, అధికారులు ప్రతి ఒక్కరు ఆయనకు దూరంగా ఉండండి." -కేఏ పాల్, ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు
కవితకు ఈడీ నోటీసులు:
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఈడీ( ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్) నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో పలు విషయాలను తెలుసుకోవడానికి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి రేపు.. కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. గత సంవత్సరం డిసెంబర్11న ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను ఇంటి వద్దనే విచారణ జరిపారు. దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించి.. పలు కీలక విషయాలను ఆమె వద్దనుంచి రాబట్టారు.
మంగళవారం రోజున రామచంద్ర పిళ్లైను అరెస్ట్ చేయడం.. వెంటనే కవితకు నోటీసులు జారీ చేయడం చూస్తే ఇంకా మరికొన్ని కీలక విషయాలు రాబట్టే పనిలో ఈడీ ఉందని స్పష్టంగా అర్థమవుతుందని ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. ఈ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని కూడా విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు కవితకు ఈడీ నోటీసులు జారీ కావడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇవీ చదవండి: