Jupally Krishna Rao Meet MP Komatireddy : బీఆర్‌ఎస్ బహిష్కృత నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూపల్లి వరుసగా కాంగ్రెస్ నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. శనివారమే మల్లు రవితో సమావేశమైన జూపల్లి.. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు. వీరిరువురు పార్టీలో చేరికకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో వీరితో పాటు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన జూపల్లి.. టీ తాగడానికి మాత్రమే కోమటిరెడ్డి దగ్గరికి వచ్చానని చెప్పారు. ఏ పార్టీలో చేరతానో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే జూపల్లి, తాను పాత మిత్రులమని.. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Jupally Krishna Rao Meet Mallu Ravi : ఇదిలా ఉండగా.. శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవితో జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చర్చలు జరిపారు. జూపల్లి కృష్ణారావు మల్లు రవితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మాజీ మంత్రి జూపల్లి కాంగ్రెస్ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాను మల్లు రవి మంచి మిత్రులమని.. అందుకే అల్పహారం సేవించడానికి వారి ఇంటికి వెళ్లినట్లు జూపల్లి పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్‌లో చాలా మంది మిత్రులే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇంకా ఏ పార్టీలో చేరతానో స్పష్టతకు రాలేకపోయానని జూపల్లి తెలిపారు.
Jupally Krishna Rao Will Join Congress : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరకుండా దాగుడుమూతలు ఆడుతున్నారు. అటు కమలంవైపు వెళతారు అనుకుంటే.. ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌కే ఎందుకు ఆ పార్టీలో చేరావు అని ఎదురు ప్రశ్న వేసి.. ఆ పార్టీ నుంచి బయటకు రమ్మని సూచించారని తెలిపారు. ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ చేరకుండా ఆ పార్టీ నేతలతో హడావిడిగా గడుపుతున్నారు. వీరి చేరికకు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా మొగ్గు చూపుతున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది.
అయితే వీరి చివరి మెట్టు మాత్రం కాంగ్రెస్‌నే అని అందరూ భావిస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం పొంగులేటి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి.. తుది నిర్ణయాన్ని వెలువరించనున్నారు. మరి జూపల్లి ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో స్పష్టత ఇవ్వకుండా వస్తున్నారు. కానీ ఆయన కూడా కాంగ్రెస్‌కు జై కొట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి :