Tarunchug on Amit Shah Telangana Tour : ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ తెలిపారు. ఆరోజు నాగర్ కర్నూల్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించనున్నారని వివరించారు. ఈ క్రమంలోనే గుజరాత్లో బిపోర్ జాయ్ తుఫాన్ కారణంగా ఖమ్మంలో అమిత్ షా పర్యటన రద్దైనా.. మళ్లీ పర్యటన షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో.. తరుణ్ చుగ్ ఈ మేరకు మాట్లాడారు.
వాయిదా పడిన ఖమ్మం బహిరంగ సభను.. తిరిగి అక్కడే నిర్వహించేందుకు అధిష్ఠానం నిర్ణయించిందని తరుణ్‌చుగ్ వెల్లడించారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అగ్రశ్రేణి నేతలు పర్యటిస్తారని తెలిపారు. నేతలంతా కలిసి సమష్టిగా రాబోయే శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వివరించారు. బీజేపీలో అసలు అంతర్గత భేదాలు అనేవే లేవన్నారు. పార్టీలోని ముఖ్య నేతలందరికీ కీలకమైన పదవులు.. బాధ్యతలు ఉంటాయని తెలిపారు. ఇక్కడి రాష్ట్ర నాయకత్వంతో పార్టీ కలుపుకొనే పని చేస్తోందని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
"గుజరాత్లో బిపోర్ జాయ్ తుపాన్ కారణంగా ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా రాలేకపోయారు. ఈ సభ రద్దు కాలేదు. కేవలం వాయిదా మాత్రమే వేశాం. ఈ నెల 25న జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కు బీ టీమ్ లాగా వ్యవహరిస్తుంది. బండి సంజయ్ మార్పు అసత్య ప్రచారం. ఆయన పార్టీలో ముఖ్య నేత. ఇలాంటి ప్రచారాలను ఖండిస్తున్నా." - తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ
Amit Shah Public Meeting In Khammam Soon : బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి మార్చే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టం చేసిందని.. తరుణ్ చుగ్ వెల్లడించారు. ఆయనే రాష్ట్ర అధ్యక్షుడని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే.. కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లకు అంతర్గతంగా అనేక ఒప్పందాలు ఉన్నాయనేది అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. అయితే దేశంలోని విపక్షాల భేటీకి కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని.. మరి దీనికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీ టీమ్‌గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ఇవీ చదవండి :