jp nadda warangal tour schedule తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆటంకాలు, అవరోధాల మధ్య సాగింది. పోలీసు కేసులు, కోర్టు చిక్కులు దాటుకుని ముగింపు సభకు సిద్ధమైంది. ఈ నెల 2న యాదాద్రి లక్ష్మీనరసింహుడి చెంత నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు ఉద్రిక్తత నడుమ సాగిన పాదయాత్ర ఈరోజు ముగియనుంది. గత రెండు విడుతల్లో పాదయాత్రల్లో లేని అవరోధాలను ఈ యాత్రలో భాజపా నేతలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
యాత్ర పొడిగింపు..: ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ, అవినీతి, అరాచక పాలనపై ప్రజలకు తెలియజేసేందుకు బండి సంజయ్ ఈ యాత్రను సాగిస్తున్నారు. ఈ యాత్రను ఈ నెల 2 నుంచి 26 వరకు చేపట్టాలని తొలుత భావించినా, మునుగోడు సభ కారణంగా ఒకరోజు పొడిగించారు. దీంతో ఈరోజు భద్రకాళీ అమ్మవారి దర్శనంతో పాదయాత్ర ముగుస్తుంది. మొత్తం 26 రోజుల్లో 21 రోజులు మాత్రమే యాత్ర సాగింది. పలు కారణాలతో 5 రోజులు యాత్రకు విరామం ఇచ్చారు.
2 లక్షలకు పైగా జనసమీకరణ..: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. గతంలో కాంగ్రెస్ సభకు దీటుగా సభను నిర్వహించేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 2 లక్షలకు పైగా జనసమీకరణ చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ బహిరంగ సభకు జనసమీకరణ కోసం ఆరు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సైతం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమై బహిరంగ సభకు భారీగా జనాన్ని తరలించాలని దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాదయాత్రకు అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో కమలనాథులు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తమ సత్తా ఏంటో ఈ సభ ద్వారా తెరాసకు చూపించాలని కాషాయదళం యోచిస్తోంది. ఇప్పటికే సభాస్థలికి సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి.
jp nadda to meet mithaliraj: హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈరోజు ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. నోవాటెల్ హోటల్‌లో 12 గంటలకు మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశం అవుతారు. ఈ భేటీ అనంతరం భాజపా ముఖ్యనేతలతోనూ నడ్డా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆరా తీయనున్నారు.
jp nadda to meet hero nithin: అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు చేరకుంటారు. బండి సంజయ్, ఇతర పార్టీ నేతలతో కలిసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ప్రొఫెసర్ వెంకటనారాయణతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు బయలుదేరుతారు. నోవాటెల్‌లో సినీ కథానాయకుడు నితిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి తిరుగు పయనం కానున్నారు. ఇటీవల హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నడ్డా మిథాలీరాజ్, నితిన్‌తో సమావేశం కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తొలిసారి తెలంగాణకు భన్సల్..: మరోవైపు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే వరంగల్‌కు చేరుకున్నారు. తెలంగాణ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జిగా నియామకమైన సునీల్ భన్సల్ తొలిసారి తెలంగాణకు వచ్చారు. బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించనున్నారు.
ఇవీ చూడండి..
భాజపా సభకు హైకోర్టు అనుమతి, ఆ హామీ ఇవ్వాలని కండీషన్