ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించిందనే ఆరోపణలతో మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థపై నమోదైన కేసును తెలంగాణప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసింది. ఈమేరకు సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ మండల ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 9మంది అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. సిట్‌లో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణ్ పేట్ డీఎస్పీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల ఏసీపీలు రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సీఐలు రమేశ్, వెంకటరామ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
కూకట్పల్లికిచెందిన లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించిన దస్త్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్‌కు అప్పగించారు. పూర్తి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయం నుంచి సేకరించిన హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కీలక పత్రాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. బుధవారం ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సోదాలు చేశారు.
పథకం ప్రకారం...
సేవా మిత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐటీ గ్రిడ్ నేరపూరిత చర్యలకు పాల్పడిందని హైదరాబాద్ పోలీసులు నిర్ధారించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో సర్వే పేరుతో ఫోన్ ద్వారా ఓటర్ల నుంచి ఐటీ గ్రిడ్ సంస్థ సమాచారం సేకరించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రతినిధులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో పలుచోట్ల ఈ తరహాలో నమోదైన కేసులనుసిట్ దర్యాప్తు చేయనుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు సీఐడీ విభాగం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందానికి సహకరించనుంది.
ఇవీ చూడండి:ఐటీ గ్రిడ్స్ పై సిట్