ACB DG Anjani kumar: హైదరాబాద్ సీపీగా మూడున్నరేళ్లకు పైగా విధులు నిర్వహించానని... ఈ సమయంలో అసెంబ్లీ, ఎంపీ, జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూశామని అనిశా డీజీ అంజనీ కుమార్ తెలిపారు. కరోనా మొదటి, రెండో దశల్లోనూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు ఎంతో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతో సహకరించడం వల్ల శాంతిభద్రతల నిర్వహణ సులువైందని అన్నారు. అనిశా డీజీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని అంజనీకుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక్కడ కూడా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. అనిశా, విజిలెన్స్ డీజీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టారు. డీజీ గోవింద్ సింగ్... అంజనీకుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.
అ.ని.శా. డీజీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. హైదరాబాద్ సీపీగా మూడున్నరేళ్లకుపైగా పనిచేశా. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశాం. కరోనా సమయంలో హైదరాబాద్ సీపీగా విధులు నిర్వర్తించా. అధికారులంతా బాగా సహకరించారు.
-అ.ని.శా. డీజీ అంజనీకుమార్
ఐపీఎస్‌ల బదిలీలు
రాష్ట్రంలో భారీఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మందిని బదిలీ చేశారు. హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్‌లతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. సీనియర్ ఐపీఎస్‌లతో పాటు సిద్దిపేట, నిజామాబాద్ పోలీసు కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది.
ఇదీ చదవండి: Hyderabad CP CV Anand: ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా న్యూఇయర్ వేడుకలు: సీపీ సీవీ ఆనంద్