ప్రశ్న: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వచ్చి 15 రోజులైనా వర్షాలు ఎందుకు పడట్లేదు..?
జవాబు: జూన్ 5 నుంచి ప్రారంభమైన రుతుపవన వర్షాలు రాష్ట్రమంతా.. 18 నుంచి 19 వరకు విస్తారంగా కురిశాయి. మోస్తరు నుంచి భారీ అతిభారీ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి, అల్పపీడనాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వీటి రాకకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చు. అందువల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశం వైపు రుతుపవనాలు తరలి వెళ్లడం వల్ల ఇక్కడ వర్షాలు పడంటం లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రతీసారి వస్తూనే ఉంటాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వచ్చే అల్పపీడనాల వల్ల జులై, ఆగస్ట్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రశ్న: రాబోయే రోజుల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం ఉందా..?
జవాబు: వచ్చే నాలుగైదు రోజుల్లో అది ఉండక పోవచ్చు. ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దాని నుంచి ఒడిశా మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతం వరకు ఆవర్తనం ఉండటం వల్ల... రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 25,26 వరకు పలు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ప్రశ్న: ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షపాతం ఎలా ఉంది..?
జవాబు: ప్రస్తుతానికి రాష్ట్రంలో సాధారణంగానే వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లలో అత్యధికంగా.. 157 సెం.మీటర్లు.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 156 సెం.మీ వర్షం పడింది. అత్యల్పంగా జోగులాంబ గద్వాల్లో -48 సెం.మీ, నాగర్ కర్నూల్లో -53 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ప్రశ్న: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏ మేరకు వర్షాలు పడొచ్చు..?
జవాబు: ఈ ఏడాదికి సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రశ్న: రైతులు ఎలాంటి ప్రత్యామ్నయం తీసుకోవాలి..?
జవాబు: రైతుల కోసం వ్యవసాయ శాఖ కొన్ని ప్రణాళికలు సూచిస్తుంది. ఎండలు ఉన్నప్పుడు కలుపు లాంటి పనులు చేసుకోవడం, వర్షాలు పడినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతంగానికి వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు తెలియపరుస్తుంది. వాటిని రైతులు తప్పకుండా పాటించాలి.