ఇంటర్ నుంచే కామర్స్ సబ్జెక్టుకు ప్రాధాన్యమిస్తే విద్యార్థులకు అధిక ప్రయోజనమని అధ్యాపకులు, నిపుణులు చెబుతున్నా ఇంటర్ బోర్డు పట్టించుకోవడం లేదు. కామర్స్ విభాగంలో సంప్రదాయ డిగ్రీ చదివినా కొలువులు దొరుకుతాయి. ఇతర ఏ సబ్జెక్టుకూ లేని ప్రత్యేకత అది.
వాణిజ్యశాస్త్రం విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు
ఎంపీసీ, బైపీసీ గ్రూపుల పాఠ్య ప్రణాళికను జాతీయ ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా సీబీఎస్ఈతో పోటీగా రూపొందిస్తున్న బోర్డు, వాణిజ్యశాస్త్రం దగ్గరకు వచ్చే సరికి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. డిమాండ్‌ను గుర్తించి సీబీఎస్ఈ, ఐసీఎస్సీ బోర్డులు కామర్స్ సబ్జెక్టును మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కనీస సంస్కరణలు తీసుకురావడం లేదు.
విద్యార్థులకు ప్రయోజనం
నిపుణులు కమిటీని నియమించి సబ్జెక్టును మరింత బలోపేతం చేస్తే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఓయూ కామర్స్ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఎస్వీ సత్యనారాయణ, గజ్వేల్ డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాల సహాయ ఆచార్యుడు గోపాల సుదర్శనం సూచిస్తున్నారు.
గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు
సీఈసీ(పౌర, ఆర్థిక, వాణిజ్య శాస్ర్తాలు), ఎంఈసీ (గణితం, ఆర్థిక, వాణిజ్య శాస్త్రాలు) గ్రూపుల్లో కామార్స్ ప్రధాన సబ్జైక్టు, కామర్స్‌లో వాణిజ్య శాస్త్రంతో పాటు గణాంక శాస్ర్తం(అకౌంటెన్సీ)అనే రెండు పుస్తకాలు ఉంటాయి. ఆ రెండింటికి కలిపి 100 మార్కులకు ఒకటే పరీక్ష. ఎంఈసీలో గణితానికి మాత్రం ఒక్కోటి 50 మార్కులకు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య శాస్త్రానికి కూడా రెండు పరీక్షలు నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఛాయిస్ కింద కొన్ని అధ్యాయాలను బోధించడం లేదు. ఆ పరిస్థితికి అడ్డుకట్ట పడుతుంది.
ఎంపీసీ విద్యార్థులకు ఇచ్చే గణితం ప్రశ్న పత్రాన్నే ఎంఈసీ వారికి ఇస్తున్నారు. ఎంఈసీ విద్యార్థులు బీకాం లేదా సీఏ కోర్సులు చదువుతారు. వారికి ఎంపీసీ విద్యార్థుల తరహాలో కాకుండా కామర్స్ రంగానికి అవసరమైన కొన్ని అధ్యాయాలనైనా గణితంలో చేరిస్తే ప్రయోజనం ఉంటుంది.
ఇదీ చూడండి : బాధిత ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తెదేపా ఆర్థికసాయం