కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని సుమారు 1800 ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు ఊరటనిచ్చింది. అనుబంధ గుర్తింపు ప్రక్రియలో పలు మినహాయింపులను ఇస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మీటర్ల లోపు ఎత్తు భవనాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఆటోమేటిక్గా గుర్తింపు పునరుద్దరించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
90రోజుల్లో వివరాల సమర్పణకు అవకాశం
అనుబంధ గుర్తింపు రుసుమును ఈ ఏడాది 33 శాతం పెంచాలన్న నిర్ణయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఉపసంహరించుకుంది. గతేడాది ఫీజులతోనే కాలేజీల గుర్తింపును పునరుద్ధరించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. శానిటరీ, నిర్మాణ సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు, 33 శాతం సిబ్బంది వివరాలను 90 రోజుల్లో సమర్పించేందుకు యాజమాన్యాలకు అవకాశం ఇచ్చింది.
ఈనెల 30 వరకు దరఖాస్తుకు అవకాశం
15 మీటర్లకు మించి ఎత్తు ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్న కాలేజీలు మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. తాజా మినహాయింపుల నేపథ్యంలో.. అనుబంధ గుర్తింపు కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని జలీల్ తెలిపారు. ఆలస్య రుసుము 5వేల రూపాయలతో జులై 7 వరకు, 10వేలతో జులై 14, 15వేల రూపాయలతో జులై 22, 20వేల రూపాయలతో జులై 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా వేళ తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని మినహాయింపులు ఇచ్చినందుకు రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: ఎలక్ట్రానిక్ వాహనాల రంగంలో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి