TS Inter Exams 2021: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో 50 శాతం ఛాయిస్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. కరోనా కారణంగా గత విద్యాసంవత్సరం(2020-21) కూడా 50 శాతం ఛాయిస్ ఇస్తామని బోర్డు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి వల్ల వార్షిక పరీక్షలు జరగలేదు. ఇటీవల ఇంటర్ ప్రథమ విద్యార్థులకు(ఇప్పుడు సెకండియర్ చదువుతున్న) మాత్రం పరీక్షలు జరిపారు. అందులో 50 శాతం ఛాయిస్ అమలు చేశారు. ప్రశ్నపత్రంలో ఎ, బి, సి..మూడు సెక్షన్లు ఉండగా... వీటిలో రెండింట 50 శాతం విధానాన్ని అమలు చేశారు. సెక్షన్-బి, సిలలో 10 ప్రశ్నలిస్తే ఒక్కో దాంట్లో అయిదింటికి సమాధానాలు రాయాలి. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకూ ఇదే పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించినట్లు ఇంటర్‌బోర్డు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. సిలబస్‌లో 30 శాతం తగ్గించి... 70 శాతం పాఠ్య ప్రణాళికకే పరీక్షలు జరుపుతామని తాజాగా బోర్డు ప్రకటించగా... తగ్గించిన సిలబస్‌ను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లో మంగళవారం పొందుపరిచింది.
ఎంసెట్‌కూ 70 శాతం సిలబస్సే
ఇంటర్ బోర్డు 30 శాతం సిలబస్ తగ్గించినందున 70 శాతం సిలబస్ ఆధారంగా ఎంసెట్ జరగనుంది. తొలి ఏడాదిలో 100 శాతం, రెండో సంవత్సరంలో 70 శాతం మీదనే ఎంసెట్ జరిపారు. దాంతో ప్రథమ ఇంటర్ సిలబస్‌కు 55 శాతం వెయిటేజి ఇచ్చి 88 ప్రశ్నలు... ద్వితీయ ఇంటర్‌కు 45 శాతం వెయిటేజి ఇచ్చి.. 72 ప్రశ్నలను ఎంసెట్‌లో ఇచ్చారు. ఈసారి ఎంసెట్ రాసే విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్ పరీక్షలు 70 శాతం సిలబస్ ఉన్నందున గతంలో మాదిరిగానే ఒక్కో ఏడాదికి 80 ప్రశ్నల చొప్పున ఇస్తారు. కాకపోతే అవి 70 శాతం సిలబస్ నుంచి ఇస్తారు.
ఇదీ చూడండి: Inter syllabus: ఇంటర్ పరీక్షల్లో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు