ఇంటర్మీడియట్(Inter) ద్వితీయ సంవత్సరం ఫలితాల వెల్లడికి కసరత్తు జరుగుతోంది. ఫలితాల వెల్లడికి కోసం అనుసరించాల్సిన విధివిధానాలను కమిటీ రూపొందించింది. కమిటీ సిఫార్సులతో కూడిన నివేదికను ఇవాళ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రభుత్వానికి సమర్పించారు. మొదటి సంవత్సరం మార్కులను ప్రామాణికంగా తీసుకొని.. రెండో సంవత్సరం మార్కులు వేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. కమిటీ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇంటర్ బోర్డు ఫలితాలను వెల్లడించనుంది. మార్కుల కేటాయింపు, అప్ లోడ్ తదితర ప్రక్రియకు వారం, పది రోజులు పట్టే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
జులై 1 నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నట్లు జలీల్ పేర్కొన్నారు. జులై 15 నుంచి మొదటి సంవత్సరం ప్రారభించాలని భావిస్తున్న ఇంటర్ బోర్డు(Inter board).. ప్రవేశాలను బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ కళాశాలల అనుబంధ గుర్తింపు ప్రక్రియలో స్తబ్ధత కొనసాగుతోంది. సుమారు 70 శాతం కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఫీజు తీసుకోకుండానే అనుమతి పునరుద్ధరించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. అయితే ఉచితంగా గుర్తింపు ఇవ్వడం వీలు కాదని.. ఈ ఏడాది ఫీజు పెంచకుండా గతేడాది రుసుముతో గుర్తింపు ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. రేపో, ఎల్లుండో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి.. తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి: రూ.16కోట్ల ఇంజెక్షన్ అందక చిన్నారి మృతి