ఏడాదిలోపు వయసున్న శిశు మరణాల రేటు(ఐఎంఆర్) రాష్ట్రంలో గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గింది. 2014లో ప్రతి వెయ్యి జననాలకు ఏడాదిలోపు శిశువులు 39 మంది మరణిస్తుండగా.. తాజాగా 2018 గణాంకాల్లో 27కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ‘నమూనా నమోదు విధానం (ఎస్‌ఆర్‌ఎస్)’ సర్వేలో ఈ విషయాలను వెల్లడించింది.
జాతీయ సగటు కంటే మెరుగ్గా..
రాష్ట్రంలోని గ్రామీణంలో 121, పట్టణాల్లో 103 చొప్పున మొత్తంగా 224 కేంద్రాల్లో నమూనాలను సేకరించారు. వీటిల్లో గ్రామీణ తెలంగాణలో 1.57 లక్షల జనాభాను, పట్టణాల్లో 0.58 లక్షల జనాభా కలుపుకొని మొత్తంగా 2.15 లక్షల జనాభా నుంచి నమూనాల నమోదు చేపట్టారు. శిశు మరణాల రేటులో జాతీయ సగటు(32) కంటే తెలంగాణ(27)లో తక్కువగా నమోదవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో 29 మరణాలు నమోదయ్యాయి.
పట్టణాల్లో తక్కువ మరణాలు..
శిశు మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నాగాలాండ్(4) మొదటి స్థానంలో ఉండగా.. మిజోరం(5), గోవా(7), కేరళ(7), సిక్కిం(7) తర్వాత స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ గ్రామాల్లో ప్రతి వెయ్యి జననాలకు 30 శిశుమరణాలు సంభవిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో వీటి సంఖ్య 21గా నమోదైంది.
ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్ దాడులు