ప్రపంచాన్ని కరోనా పట్టి పీడిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు విశ్రమించట్లేదు. రోజుకో మాయతో అమాయక ప్రజల్ని దోచుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో.. ఉచితంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఇస్తామంటూ.. ప్రజలను గాలం వేస్తున్నారు. తాము నిర్వహించే సర్వేలో పాల్గొంటే చాలంటూ.. ఇటీవల అనేక మంది అంతర్జాల వినియోగదారులను మోసం చేసి డబ్బులు లాగారు. ఈ తరహా మోసంతో... బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
షేర్ చేయండి@మోసం..
మరో రకం సైబర్ మోసంలో... కేవలం పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ఆ సమాచారాన్ని పది మంది వాట్సాప్ వినియోగదారులకు పంపాలని షరతు విధించారు. ఇది నమ్మి అనేకమంది ఆ సర్వేని పూర్తి చేసి తమ వాట్సాప్ మిత్రబృందంలో పది మందికి పంపారు. ఆ పది మంది లింక్ తెరవగానే వారి చరవాణిలో ఉన్న వ్యక్తిగత సమాచారం నేరగాళ్లకు చేరిపోయింది.
6,500 చెల్లిస్తే చాలు..
కరోనానూ సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మలుచుకుంటున్నారు. శానిటైజర్లతో పాటు మాస్క్‌ల కొరతను అవకాశంగా మలచుకుని... తమ వద్ద పేరొందిన సంస్థల శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 6,500 చెల్లిస్తే చాలు... ఇంటిల్లిపాదికి ఉపయోగపడే కిట్ పంపిస్తామని అంతర్జాలంలో ప్రచారం చేశారు. ఈ మాటలను నమ్మి అనేక మంది డబ్బులు చెల్లించారు. ఎన్నిరోజులు ఎదురు చూసినా కిట్ రాకపోగా.. మోసపోయినట్టు గుర్తించారు.
కరోనా సోకిందని..
మరో కేసులో తమ సమీప బంధువులకు కరోనా సోకిందని, చికిత్స కోసం సాయం చేయమని కొందరు ఫోన్‌లో చందాల పేరిట అభ్యర్థిస్తున్నారు. ఇంకో కేసులో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రఖ్యాత సంస్థలతో పాటు ఆరోగ్యశాఖ వంటి పేర్లతో కరోనా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని కొన్ని వెబ్‌సైట్‌లలో కరోనా మ్యాప్‌ల పేరుతో కొన్ని యాప్‌లను ప్రచారంలోకి తెస్తున్నారు. వాటిని తెరిస్తే చాలు కంప్యూటర్ లేదా సెల్‌ఫోన్‌లో మాల్వేర్ అనే వైరస్ వచ్చేస్తుంది. ఇది మన వ్యక్తిగత సమాచారం నేరస్థులకు చేరవేస్తుంది. అందులో బ్యాంకు వివరాలు వంటివి ఉంటే ఖాతా ఖాళీ అయినట్లే.
మద్యం సరఫరా చేస్తామని..
మద్యం సరఫరా చేస్తామని ఫేస్‌బుక్ , వాట్సాప్ ద్వారా ప్రచారం చేసి మోసం చేశారంటూ ఓ వ్యక్తి... తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా కరోనా కాలంలోనూ మోసగాళ్లు కొత్త పంథాలకు తెరతీస్తున్నారు. ఆన్‌లైన్ మోసాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి అప్రమత్తతే ప్రధానమని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'