ఒకే ఇంట్లో 16 మందికి ... మంగళ్‌హాట్‌లో ఒకే ఇంట్లో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు సోదరులు, వారి పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు మొత్తం 27 మంది ఈ ఇంట్లో ఉంటున్నారు. ఈ కుటుంబ యజమాని(57) కొవిడ్ బారినపడి చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు 16 మందికి వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో 8 మంది చిన్నారులే. ఈ కుటుంబంలోని ఓ యువకుడి ద్వారా ఇంటి యజమానికి.. తద్వారా మిగతా వారికి సోకిందని అనుమానిస్తున్నారు.
- మంగళ్‌హాట్ శివలాల్‌నగర్‌లో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని(59)కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబంలోని 27 మంది ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. ఇటీవల ఆమె కోడలితో కలసి కూరగాయల మార్కెట్‌కు వెళ్లొచ్చారు. అనారోగ్యానికి గురవటంతో వైద్యపరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. కుటుంబంలో మరో ఇద్దరికీపాజిటివ్ వచ్చింది.
గుట్టుగా అంటించేశాడు
కాటేదాన్: మహారాష్ట్రకు చెందిన ఓవ్యక్తికి(50) బేగంబజార్‌లో వ్యాపారం ఉంది. అతనికి నగరంలోని రాఘవేంద్రకాలనీ శాస్త్రిపురం మార్గంలో రెండుగదులు ఉన్నాయి. అతని వద్ద పనిచేసే కార్మికులు వాటిల్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి వచ్చి కరోనా లక్షణాలతోనే గుట్టుగా ఆ గదుల్లో విశ్రాంతి తీసుకున్నాడు. శనివారం అతని ఆరోగ్యం క్షీణించటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాజిటివ్‌గా తేలింది. కార్మికుల సమాచారం సేకరిస్తున్నారు.
నడుంనొప్పి అని వెళితే..
ముషీరాబాద్: బోలక్‌పూర్ డివిజన్‌కు చెందిన 8 నెలల గర్భిణి(32)కి నడుంనొప్పి రావటంతో కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ ఇంట్లోని 18 మందికి హోం క్వారంటైన్ విధించారు.
ఆసుపత్రి క్యాంటీన్ ఉద్యోగికి
బోరబండ: రహ్మత్‌నగర్ డివిజన్ ఓంనగర్‌లో ఉండే ఓ వ్యక్తి ఓ ప్రైవేటు ఆసుపత్రి క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు. కొవిడ్ లక్షణాలతో స్వయంగా గాంధీ ఆసుపత్రికి వెళ్లగా పాజిటివ్‌గా తేలింది.
మోతీనగర్‌లో ఇద్దరు
మూసాపేట: మోతీనగర్‌లోని అవంతినగర్ తోటలో ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణైంది. ఆయన భార్య, కుమారుడు, పనిమనిషి, అద్దెకుంటున్న కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించారు. తాజాగా ఇద్దరికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
గోల్నాక: అశోక్‌నగర్‌లోని ఓ వ్యక్తి(39)కి ఇటీవల కరోనా సోకింది. అతడి కుటుంబంలోని 8 మందిలో మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది.
ఇంటింటా తనిఖీలు..
ఎల్బీనగర్: మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామహిల్స్ కాలనీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఇంటింటా సర్వే చేస్తున్నారు. 1116 మంది వివరాలు సేకరించారు.
బాధితుడి డిశ్ఛార్జి
అమీర్‌పేట, నల్లకుంట: ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో 18 మంది చేరారు. కోలుకున్న ఓ వ్యక్తిని ఇంటికి పంపారు. నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో ఇద్దరు కరోనా అనుమానితులు చేరారు.
మణికొండ మున్సిపాలిటీ అలీజాపూర్‌కు చెందిన మహిళ(42) ఈనెల 10న బంధువుల శుభకార్యానికి హాజరైంది. ఆ కార్యక్రమానికి హాజరైన మరో మహిళకు గతంలో పాజిటివ్ రావడంతో మిగతా వారందరికీ పరీక్షలు నిర్వహించారు. అలీజాపూర్ మహిళకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో ఐదుగురిని పరీక్షల కోసం కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపారు. వారిలో 60 ఏళ్ల వృద్ధుడు, ఏడాదిన్నర పసిపాప ఉన్నారు.