నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు వ్యాపించి... ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని పేర్కొన్నారు. అదే విధంగా రుతుపవనాల ద్రోణి బికనేర్, అజ్మీర్, దక్షిణ ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.
ఈ రోజు తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతూ రుతుపవనాల ద్రోణిలో కలిసిందన్నారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారీ నుంచి అతి భారీ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు చాలా ప్రదేశాల్లో పడుతాయన్నారు.
గత వారం పది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు పల్లెలు, పట్టణాలన్నీ తడిసిమద్దయిపోతున్నాయి. వాగులు వంకలన్నీ పొంగిపొర్లుతుండటంతో... చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాగుల ఉద్ధృతి భారీగా పెరగడంతో రాష్ట్రంలో రెండు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఓ చోట నవవధువు సహా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరోచోట ఓ దివ్యాంగుడు కారుతో సహా కొట్టుకుపోయి... శవంగా బయటకొచ్చాడు.
ఇదీ చూడండి: Car washed away: ఎంకేపల్లి వాగులో వృద్ధుడి మృతదేహం లభ్యం
హైదరాబాద్లో ఒక్కసారిగా కురిసిన వానతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. గంటలపాటు ట్రాఫిక్లోనే నిరీక్షించారు.
ఇదీ చూడండి: వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం