రోజురోజుకూ హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది. అంతటా భవనాలు పుట్టుకొచ్చి చెట్టూ చేమా కనిపించకుండా పోయి కాంక్రీట్ జంగిల్‌గా మారుతోంది. అయితే అక్కడక్కడా మిగిలి జనానికి కాస్త ఊపిరినిస్తోన్న కాలనీ ఉద్యానవనాలు సైతం ఇప్పుడు ఉన్నోళ్ల కన్నుపడి మాయమవుతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ అంతస్తుల నడుమ ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అక్రమార్కుల చేతిల్లో చిక్కి కంటికి కనిపించకుండా పోయాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలోని ఓ రెండు పార్కులే ఇందుకు నిదర్శనం. అక్రమ రిజిస్ట్రేషన్‌తో ఇప్పటికే పూర్తి స్థాయిలో భారీ భవంతి నిర్మాణంతో దాదాపు 1,100 చదరపు గజాల పార్కు స్థలం ఒకటి కనుమరుగు కాగా.. హద్దులు చెరిపేసి కలిపేసుకోవడంతో మరో 856 గజాల పార్కు కబ్జాకు గురైంది. వీటిపై ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు రూ.15 కోట్ల విలువైన భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
ఆనవాళ్లూ లేవు!
అలకాపురి టౌన్‌షిప్‌లోని వివేకానందనగర్ కాలనీలో 97, 98, 99 సర్వే నంబర్లలో దాదాపు 1100 గజాల విస్తీర్ణంలో ఈత కొలను, చెట్లతో పార్కు స్థలం ఉండేది. దానికి ఆనుకొనే కాలనీ సంఘానికి చెందిన క్లబ్ హౌస్ ఉంది. ఈ భూమిని కొందరు 95/పి సర్వే నంబర్‌లో 47, 47ఏ ప్లాట్లుగా సృష్టించి 2018లో డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇక్కడున్న కొలను, చెట్లను కూలదోసి 2019లో నిర్మాణం మొదలు పెట్టగా గతేడాది చివరి నాటికి ఐదంతస్తుల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడక్కడ పార్కు ఆనవాళ్లేం లేవు. అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారికంగా పొందిన తప్పుడు పత్రాలు చూపించి నిర్మాణం చేపట్టారని కాలనీ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
అధికారుల వత్తాసు!
ఈ భవనాన్ని అక్రమ నిర్మాణంగా గుర్తించిన మణికొండ మున్సిపల్ కమిషనర్ విద్యుత్తు కనెక్షన్ నిలిపి వేయాలని గతేడాది డిసెంబరులో నోటీసులిచ్చారు. ప్రస్తుతం ఈ భవనానికి విద్యుత్తు సరఫరా లేదు. దీనికి ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తే కూల్చేస్తామని హెచ్‌ఎండీఏను పురపాలకశాఖ అధికారులు కోరారు. దీనిపై ఇప్పటివరకూ అటునుంచి స్పందన లేదు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సరిగా ఉన్నా హెచ్‌ఎండీఏలోని ఓ ఇద్దరు అధికారులు కావాలనే ఫిర్యాదుల్ని పట్టించుకోవట్లేదని ఇక్కడి స్థానికులంటున్నారు.
హద్దులు చెరిపేసి..!
ఇదే అలకాపురి టౌన్‌షిప్ పరిధిలో స్వామి వివేకానందనగర్‌లో దాదాపు 300 కుటుంబాలు నివాసముంటున్నాయి. 126 నుంచి 133, 135(పీ) నుంచి 140(పీ) సర్వే నంబర్లలో 130, 438 చ.గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉన్న ఈ లేఅవుట్‌లో 13,383 చ.గజాల విస్తీర్ణం పార్కుకు కేటాయించారు. అందులో 944 గజాలు వాణిజ్య సముదాయాల రూపంలో సౌకర్యాల కల్పనకు కేటాయించారు. ఆ స్థలాన్ని కొన్న భవన నిర్మాణదారుడొకరు 944 గజాల స్థలంతోపాటు పార్కులోని మరో 856 గజాల్ని కలుపుకుని మొత్తం 1800 చ.గజాల్లో ఓ భారీ భవనం కట్టడం ప్రారంభించారు. దీంతో సగం పార్కు ఆక్రమణకు గురైంది.
* ఆ పార్కు స్థలం ఆక్రమణపై స్థానిక టీపీవోను కలిసేందుకు వెళ్తే తరచూ తిప్పించుకుంటున్నారని, ఇప్పుడు కాదు అప్పుడంటూ రోజులు దాటేస్తున్నారని కాలనీ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ఇతర ఉన్నతాధికారులూ స్పందించడం లేదని వాపోతున్నారు.
ఇదీ చూడండి : 'ఫ్రిజ్‌లో మృతదేహం' వీడిన మిస్టరీ