దేశ రాజధానిలో పోలీసులపై దాడులు జరగడం వల్ల కేంద్ర నిఘా వర్గాలు హైదరాబాద్ పోలీసులను హెచ్చరించాయి. అప్రమత్తమైన భాగ్యనగర పోలీసులు పశ్చిమమండలం, పాతబస్తీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారత్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన ముగిసినా.. హైదరాబాద్ బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద అదనంగా ఏర్పాటు చేసిన భద్రతను కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజులపాటు.. రాత్రివేళల్లో తిరిగే గస్తీ బృందాలను పెంచాలని పోలీసులు నిర్ణయించారు. సభలు, సమావేశాలపై కూడా నజర్ పెంచనున్నారు. పోలీసులకు సమాచారం లేకుండా సభలు, సమావేశాలు, నిరసనలు చేసేవారిని కట్టడి చేయనున్నారు.
మరోవైపు సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఈనెల 26, 29 తేదీల్లో సభలు నిర్వహించనున్నామంటూ రెండు రాజకీయ పార్టీలు వేర్వేరుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తుండగా.. వీటిపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చిత్రాలు, వీడియోలు ఉంచుతున్న వారిపై ఐటీ విభాగం ఇప్పటికే నిఘా ఉంచగా... అభ్యంతరకర అంశాలను పోలీస్ అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
దిల్లీ తరహా హింసాత్మక ఘటనలు హైదరాబాద్లో ఉత్పన్నం కాకుండా.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.