Akanksha Vidyasagar Murder Case Update : ప్రియురాలిని హత్య చేసి అదృశ్యమైన నిందితుడి జాడ కోసం.. బెంగళూరు పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. దిల్లీకి చెందిన అర్పిత్.. తన ప్రియురాలు హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్‌ను ఈ నెల 5న హత్య చేసి పరారయ్యాడు. అప్పటి నుంచి కనిపించకుండాపోయిన నిందితుడు.. దేశం విడిచి వెళ్లకుండా జీవన్‌బీమా నగర పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..: హైదరాబాద్‌కు చెందిన ఆకాంక్ష విద్యాసాగర్ (23) బెంగళూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనిలో పని చేస్తుంది. ఆ సంస్థలోనే దిల్లీకి చెందిన అర్పిత్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కాగా కొన్ని నెలలుగా వీరిద్దరూ జీవన్‌బీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలో ఉన్న ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు. ఇటీవలే అర్పిత్‌కు ప్రమోషన్ వచ్చింది. తాను ఆ పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో విడిపోదామంటూ ఆకాంక్ష అర్పిత్‌తో గొడవ పడింది. ఇది నచ్చని అర్పిత్.. కోపానికి గురై ఆకాంక్షను హత్య చేయాలని పథకం రచించాడు. తన ప్లాన్‌లో భాగంగా జూన్ 5వ తేదీ రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు.
Hyderabad woman Suspicious death case in Bangalore : నేరుగా ఆకాంక్ష ఫ్లాట్‌కు వచ్చిన అర్పిత్.. ఇదే విషయంలో ఆకాంక్షతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన నిందితుడు.. ఆకాంక్ష మెడకు చున్నీ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు తనను గుర్తించే అవకాశం ఉందని.. తన ఫోన్‌ను సైతం ఆకాంక్ష అపార్ట్మెంట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు.
ఆకాంక్ష మరో రూమ్‌మేట్ ఫ్లాట్‌కు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విగతజీవిగా పడి ఉన్న తన స్నేహితురాలిని చూసి హతాశురాలైన ఆమె.. పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న జీవన్‌బీమా నగర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కుటుంబ సభ్యులు, పరిచయస్థులు, బంధువులను విచారించినా.. అతడి జాడ లభించలేదు. ఈ నేపథ్యంలో నిందితుడి ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని ఆచూకి తెలిసిన వారు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: