హలో నేను మీ భాగ్యనగరాన్ని... మీరందరూ ఎలా ఉన్నారు.? చాలా ఇబ్బందిగా కష్టంగా ఫీలవుతున్నారు కదా. నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను. వాహనాలు, పరిశ్రమల నుంచి మీరు వదిలిన ఉద్గారాల వల్ల మాడిపోయిన పెసరట్టులా తయారైన నా ఊపిరితిత్తులు పురివిప్పిన నెమలిలా ఆనందంతో నాట్యం చేస్తున్నాయి. కోకిల కిలకిలా రాగాలు, హుస్సేన్ సాగర్‌లోని జలసవ్వడులు హాయిని పంచుతున్నాయి.
మీ ఆనందాల కోసం ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ, సైబర్ సిటీ అంటూ ఎన్నో వాహనాలను రింగురోడ్లపై రయ్యిరయ్యిమంటూ చక్కర్లు కొట్టారో గతుకులు పడ్డ నా శరీరానికే తెలుసు. నా మీద ఒక్క వాహనాలనే మాత్రమే నడిపేవారా ఖాండ్రించి ఉమ్మేసేవారు, మూత్ర విసర్జన చేసేవారు. నానా రభస చేసే వాళ్లు. పరిశుభ్రంగా ఉంచాలని ప్రాధేయపడినా వదిలేసిన పాపాన పోలేదు. ఇప్పడు మాత్రం నేను క్లీన్ అండ్ గ్రీన్‌గా... అద్ధంలా మెరుస్తున్నాను.
సినిమాలు, షికార్లు అంటూ గుంపులు, గుంపులుగా అమీర్‌పేట్, ఆర్టీస్ క్రాస్ రోడ్స్ ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ అంటూ అంతా తిరుగుతూ నన్ను మసిబారేశారు కదా? ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు, పబ్లిక్ గార్డెన్, జూపార్కు ఇలా అన్ని చోట్లకు వచ్చినా మీపైన ఉన్న ప్రేమతో స్వచ్ఛమైన చల్లని గాలిని పంచాను. తినేసిన అరటిపండు తొక్కలు, గర్ల్‌ఫ్రెండ్‌కి కొన్న ఐస్‌క్రీమం కప్పులే కాకుండా... నలిగిన పువ్వులు, తెగిన చెప్పులు నామీద పడేసినా ఓర్చుకున్నాను.
మీరెన్ని కష్టాలు పెట్టినా కడుపులో దాచుకొని మిమ్మల్ని కాపాడుకుంటున్నా... అయినా నా మాట వినలేదు. కానీ కంటికి కనిపించని వైరస్‌కు భయపడి నన్ను రక్షించారు. ఒక వైపు సంతోషం.. మరొక వైపు మీరందరూ లేని వెలితి ఉంది. మీ రాక కోసం రహదారులను తెరిచే ఉంచాను. వచ్చి ప్రకృతి అందాలను, చల్లని గాలిని ఆస్వాదించండి.
ఇదీ చూడండి:భారత్‌లో 1981కి పెరిగిన కరోనా మరణాలు