రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ కొత్తగా జీవో ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ధరలు నిర్ణయించాలని ఆదేశించినా ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. కోర్టు ధిక్కరణేనని వ్యాఖ్యానించింది. మొదటి దశలోనే ఛార్జీల గరిష్ఠ పరిమితులు ఖరారు చేస్తూ జీవో జారీ చేశామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలపగా... రెండో దశలో చికిత్స విధానాలు మారిపోయాయని.. సీటీ స్కాన్ వంటి పరీక్షలు అవసరం అవుతున్నాయని హైకోర్టు పేర్కొంది. త్వరలో ధరల పరిమితులు సవరించి జీవో జారీ చేస్తామని డీహెచ్ చెప్పటంతో తదుపరి విచారణలోగా కొత్త జీవో జారీ చేసి సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి..
అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నామని డీహెచ్ శ్రీనివాసరావు నివేదించారు. ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు అందగా.... 21 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలను రద్దు చేసినట్లు వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల మెడపై కత్తి పెట్టి డబ్బులు ఇప్పించాలి కానీ.... తలనే నరికేస్తే ఏం లాభమని హైకోర్టు వ్యాఖ్యానించింది. చికిత్సలు రద్దు చేయటం కన్నా బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఛార్జీలు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవడం ముఖ్యమని అభిప్రాయపడింది. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చికిత్సలు నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బంది పడతారన్న హైకోర్టు.. లోపాలు సరిదిద్దుకుంటే చికిత్సలను పునరుద్ధరించే అంశం పరిశీలించాలని న్యాయస్థానం సూచించింది.
స్పష్టమైన ప్రణాళిక ఉండాలి
మూడో దశ ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మూడో దశలో.... పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేకపోయినా.... అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నీ ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నామని తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అయితే.... చేస్తామంటే సరిపోదని ఎప్పట్లోగా పూర్తి చేస్తారో ప్రణాళిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.
నివేదిక సమర్పించాలి..
దేశంలో ఆందోళన కలిగిస్తున్న బ్లాక్ ఫంగస్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్రానికి కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలు ఎందుకు సరఫరా చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించగా.. అవసరాలను బట్టి ఇస్తున్నామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. వీటితో పాటు పేదలకు ఉచిత బియ్యం, సరకుల పంపిణీ వంటి చర్యలు నివేదిక సమర్పించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులను కరోనా యోధులుగా గుర్తించారా అని ప్రశ్నించిన ధర్మాసనం.... కొవిడ్ బారిన పడిన వారికి ఎలా సాయం చేశారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని విద్యా శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 10కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: ఆకాశంలో అద్భుతం 'హలో'.. ఈ ఏడాది ఏం జరగనుంది?