విజయవాడ కరకట్ట వద్ద ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు చేసిన పని అందర్నీ పరుగులు పెట్టించింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆయన నివాసంపైకి డ్రోన్ ప్రయోగించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని తెదేపా కార్యకర్తలు పట్టుకున్నారు. దేవినేని అవినాష్, ఇతర నాయకులు అక్కడికి చేరుకున్నారు. డ్రోన్ ఎందుకు ప్రయోగించారనే విషయాన్ని వారినడిగి తెలుసుకునేందుకు తెదేపా నేతలు యత్నించారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ప్రయోగించిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని వీడియో తీయడానికి వారికి ఎవరు అనుమతి ఇచ్చారని తెదేపా నేతలు పోలీసులను ప్రశ్నించారు. ఆ ఇద్దరు వ్యక్తులను స్టేషన్‌కు తరలించకుండా పోలీసు జీపునకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు, తెదేపా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. తెదేపా నాయకులు పోలీసు జీపు కదలకుండా చుట్టుముట్టారు. చంద్రబాబు నివాసానికి దేవినేని ఉమ, శ్రావణ్, జీవీ ఆంజనేయులు చేరుకున్నారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.
ఆయన చెబితేనే తీశాం
డ్రోన్ ప్రయోగించి పట్టుబడినవారు ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. జగన్ వద్ద పనిచేసే వారు తమను పంపారని నిందితులు వాగ్మూలం ఇచ్చారు. నిన్న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు కూడా తామే షూట్ చేసామని వారు తెలిపారు. జగన్ నివాసంలో ఉన్న కిరణ్ అనే వ్యక్తి ఆదేశాలతో తెదేపా నేత చంద్రబాబు ఇంటి విజువల్స్‌ను డ్రోన్ ద్వారా తీస్తున్నామని పట్టుబడిన వ్యక్తులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: గవర్నర్ తేనీటి విందుకు హాజరైన పలువురు ప్రముఖులు.